వచ్చే ఎన్నికలతో కుటుంబ రాజకీయాలు ముగుస్తాయి: బిజేపీ

by Dishanational2 |
వచ్చే ఎన్నికలతో కుటుంబ రాజకీయాలు ముగుస్తాయి: బిజేపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు 2024 లోక్‌సభ ఎన్నికలు ప్రజలకు చివరి అవకాశమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది స్పందించారు. రాబోయే ఎన్నికలతో ప్రజాస్వామ్యం ముసుగులో చేస్తున్న కుటుంబ రాజకీయాలకు ముగింపు పడుతుందని తెలిపారు. దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఆవిర్భవించనుందని చెప్పారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘జమ్మూ కశ్మీర్‌లో అబ్దుల్లా, ముఫ్తీ, పంజాబ్‌లో బాదల్‌, హర్యానాలో హుడా కుటుంబం ఎన్నికల్లో ఓడిపోయింది. రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ కుమారుడు, అఖిలేష్ యాదవ్ భార్య ఎన్నికల్లో ఓడిపోయారు, బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె ఎన్నికల్లో ఓటమి పాలైంది. అంతేగాక కుటుంబ రాజకీయాలకు అతిపెద్ద చిహ్నం అయిన రాహుల్ గాంధీ సైతం ఎన్నికల్లో ఓడిపోయారు’ అని వ్యాఖ్యానించారు. అసలైన ప్రజాస్వామ్యం త్వరలోనే ఆవతరిస్తుందని చెప్పారు. ‘భారత దేశంలో ఇద్దరు ప్రధానులు మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు. అందులో ఒకరు వాజ్ పేయి, మరొకరు ప్రధాని మోడీ’ అని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ఎన్నుకున్నది కాంగ్రెస్ అధ్యక్షుడే తప్ప ప్రజలు ఎన్నుకోలేదని విమర్శించారు.

Next Story

Most Viewed