సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ ఇక లేరు

by Dishanational4 |
సంగీత విద్వాంసుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ ఇక లేరు
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ శాస్త్రీయ గాయకుడు ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ (55) కన్నుమూశారు. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు గత నెల 23న ఆరోగ్యం విషమించగా కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. రెండువారాలుగా ఐసీయూలో వెంటిలెటర్‌పై చికిత్సపొందుతున్న రషీద్‌ ఖాన్‌ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జన్మించారు. తాత ఉస్తాద్‌ నిసార్‌ హుస్సేన్‌ ఖాన్‌ వద్ద ఆయన శాస్త్రీయ సంగీతంలో ట్రైనింగ్ తీసుకున్నారు. తొలిసారిగా 11 సంవత్సరాల వయసులో రంగస్థల ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత సినిమాల్లోనూ పాటలు పాడారు. ‘జబ్‌ వి మెట్‌’ సినిమాలో రషీద్‌ ఖాన్‌ పాడిన ‘ఆవోగే జబ్ తుమ్ సాజ్నా’ పాట బాగా పాపులర్‌ అయింది.

సినిమా పాటలు బంపర్ హిట్

సినిమాల్లో ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ పాడిన పాటల్లో ‘తెరే బినా మోహే చైన్’ పాట సూపర్‌హిట్ అయింది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ‘మై నేమ్ ఈజ్ ఖాన్‌’ మూవీలోనూ ‘అల్లా హాయ్ రెహెమ్’ పాటపడారు. ‘రాజ్‌-3’, ‘కాదంబరి’, ‘షాదీ మే జరూర్ ఆనా’, ‘మంటో’ తదితర సినిమాల్లోనూ తన గాత్రంతో అలరించారు.పలు బెంగాలీ పాటలను సైతం ఆయన స్వరపరిచారు. ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అదుకున్నారు. కాగా, ఉస్తాద్‌ రషీద్‌ ఖాన్‌ మరణంపై బెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రషీద్ ఖాన్ ఇక లేరనే విషయాన్ని తాను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె తెలిపారు. బుధవారం రషీద్‌ ఖాన్‌‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని వెల్లడించారు.


Next Story

Most Viewed