గిరిజనుల హక్కులను కాపాడడంలో మోడీ ఫెయిల్: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్

by Dishanational2 |
గిరిజనుల హక్కులను కాపాడడంలో మోడీ ఫెయిల్: కాంగ్రెస్ నేత జైరాం రమేశ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్‌గఢ్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని గిరిజనుల హక్కులను కాపాడటంలో మోడీ విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రధాన ఆధారంగా పరిగణించబడే దట్టమైన, జీవవైవిధ్యం అధికంగా ఉండే హస్డియో అటవీ ప్రాంతానికి బీజేపీ, వారికి అత్యంత మిత్రుడైన అదానీ నుంచి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అడవిని రక్షించడానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ అడవిలో 40 బొగ్గు బ్లాకులను రద్దు చేసినట్టు గుర్తు చేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక అదానీకి చెందిన కంపెనీతో మైనింగ్‌ను పున:ప్రారంభించిందని ఆరోపించారు. ఆదివాసీ సంఘాల నుంచి తీవ్రమైన నిరసనలు ఎదురైనప్పటికీ వాటిని కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు.

హస్డియో అడవి విధ్వంసం వల్ల ఆదివాసీ వర్గాల జీవనోపాధికి పూడ్చలేని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్యావరణం, వన్యప్రాణులకు సైతం తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీ వర్గాల శ్రేయస్సును బీజేపీ ఎందుకు చెడగొడుతుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ‘ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో ప్రారంభించిన నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌ను గతేడాది అక్టోబర్‌లో ప్రధాని మోడీ ఎంతో ఆర్భాటంగా ప్రజలకు అంకితం చేశారు. రూ.23,800 కోట్లతో నిర్మించిన ఈ భారీ ప్లాంట్ బస్తర్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, స్థానిక యువతకు సైతం వేలాది అవకాశాలు వస్తాయని బస్తర్ ప్రజలు ఆశించారు. కానీ దీనిని ప్రయివేటీకరించాలని బీజేపీ యోచిస్తోంది. 50.79శాతం మెజారిటీ వాటాను తమ సన్నిహితులకు విక్రయించాలని చూస్తోంది’ అని ఆరోపించారు. అడవులను కార్పొరేట్లకు అప్పజెప్పడమే బీజేపీ లక్ష్యమా? దీనికి మోడీ సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారు.



Next Story

Most Viewed