Karnataka : భాషోన్మాదం...కర్ణాటకలో బస్సులపై దాడులు

by Y. Venkata Narasimha Reddy |

కర్ణాటకలో భాషోన్మాదం(Linguistic Extremism) హింసాత్మక ఘటనలకు దారితీసింది. తమిళనాడులో అధికార డీఎంకేతో మొదలైన భాషా వివాదం క్రమంగా చుట్టుపక్కల రాష్ట్రాలకు విస్తరించడం ఆందోళకరం.

Karnataka : భాషోన్మాదం...కర్ణాటకలో బస్సులపై దాడులు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటకలో భాషోన్మాదం(Linguistic Extremism) హింసాత్మక ఘటనలకు దారితీసింది. తమిళనాడులో అధికార డీఎంకేతో మొదలైన భాషా వివాదం క్రమంగా చుట్టుపక్కల రాష్ట్రాలకు విస్తరించడం ఆందోళకరం. కర్ణాటకలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం బెలగావి సరిహద్దులో మరాఠీలో మాట్లాడలేదంటూ కొందరు ప్రయాణికులు కర్ణాటకకు చెందిన బస్‌(BUS) డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి(Attack) చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఈ దాడి దృశ్యాలు కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో భగ్గుమన్న కన్నడ సంఘాలు చిత్రదుర్గలో మహారాష్ట్ర బస్సుపై దాడికి పాల్పడ్డాయి. డ్రైవర్‌కు మసిపూసి, బస్సుకు పెయింట్ వేసి నిరసన తెలిపారు. ఈ దాడి ఘటనలో స్థానిక పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో మొదలైన వివాదం

స్వాతంత్ర్యానికి పూర్వం బొంబాయి రాష్ట్రంలో ఉన్న బెల్గాం ప్రాంతాన్ని 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో కర్ణాటక రాష్ట్రంలో కలిపారు. కర్ణాటక ప్రభుత్వం బెల్గాం పేరును బెలగావిగా మార్చింది. అప్పటినుంచి కూడా తమ భూభాగం తమకే కావాలని మహారాష్ట్ర డిమాండ్ చేస్తుంది. అయితే బెలగావిని తిరిగి ఇచ్చేందుకు కర్ణాటక సిద్ధంగా లేదు. దీంతో ఈ ప్రాంతం కోసం రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తరుచు భాషా, ప్రాంత పరమైన ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మళనంలో ప్రధాని మోడీ కీలకోపన్యాసం చేస్తూ భాషా ప్రాతిపదికన సమాజాన్ని విభజించే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని,..భాషా వైవిధ్యం మన ఐక్యతకు అత్యంత ప్రాథమిక ఆధారమని చెప్పిన రోజు వ్యవధిలోనే ఆయా రాష్ట్రాల మధ్య భాషపరమైన దాడులు చోటుచేసుకోవడం విచారకరం.

Next Story