విచారణకు హాజరయ్యేందుకు సిద్ధం: ఈడీ సమన్లపై కేజ్రీవాల్

by Dishanational2 |
విచారణకు హాజరయ్యేందుకు సిద్ధం: ఈడీ సమన్లపై కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ పదే పదే సమన్లు జారీ చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎట్టకేలకు స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవని అభివర్ణించిన ఆయన..వాటికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాత్రమే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని తెలిపారు. ఈ నెల 12 తర్వాత ఇన్వెస్టిగేషన్‌కు హాజరయ్యేందుకు సమయమివ్వాలని ఆప్ ఈడీకి తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసింది. గత నెల 27న చివరి సారిగా నోటీసులు పంపింది. అయితే సోమవారం విచారణకు హాజరుకావాల్సి ఉండగా..దానిని తిరస్కరించిన కేజ్రీవాల్ 12వ తేదీ తర్వాత సమయమివ్వాలని కోరారు. కాగా, ఈడీ సమన్లను కేజ్రీవాల్ పలు మార్లు దాటవేయడంతో దర్యాప్తు సంస్థ రౌస్ అరెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మార్చి 16న విచారణ జరగనుంది. అయితే గతంలో ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేరని, కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ వేచి ఉండాలని ఆప్ తెలిపింది. కానీ ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టిగేషన్‌కు సిద్ధమని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శుభముహూర్తం చూసుకున్నారా: బీజేపీ

ఆప్ ప్రకటనపై బీజేపీ నేత హరీశ్ ఖురానా స్పందించారు. కేజ్రీవాల్ ఈడీ విచారణ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘ప్రతి సారి మాదిరిగానే ఈసారి కూడా కేజ్రీవాల్ ఈడీ సమన్లను తిరస్కరించారు. మార్చి 12న ఏదైనా శుభ ముహూర్తం నిర్ణయించారా? ఈడీని చూసి ఎందుకు భయపడుతున్నారు. ఈడీ విచారణకు సిద్ధంగా ఉంటే సోమవారం ఎందుకు హాజరుకాలేదు? అని ప్రశ్నించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తుంటే లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

Next Story

Most Viewed