కేజ్రీవాల్ ఒక సింహం..ఆయనను ఎక్కువ కాలం బంధించలేరు: సునీతా కేజ్రీవాల్

by Dishanational2 |
కేజ్రీవాల్ ఒక సింహం..ఆయనను ఎక్కువ కాలం బంధించలేరు: సునీతా కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో సేవ్ డెమోక్రసీ పేరుతో ర్యాలీని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ప్రసంగించారు. కేజ్రీవాల్ ఒక సింహమని ఆయనను ఎక్కువ కాలం జైలులో ఉంచలేరని అన్నారు. కేజ్రీవాల్ నిజమైన దేశభక్తుడని, నిజాయితీ పరుడని కొనియాడారు. కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ‘నేను మీ నుండి ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో ఒకరిని ఓడించడానికి సహాయం చేయమని కోరడం లేదు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రమే దోహదపడాలని 140 కోట్ల మంది భారతీయులను అడుగుతున్నా’ అని కేజ్రీవాల్ మెసేజ్‌ను సునీతా చదివారు.

అలాగే లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఇచ్చిన ఆరు హామీలను కూడా వెల్లడించారు. దేశం మొత్తం 24 గంటల కరెంట్, పేదలందరికీ ఉచిత విద్యుత్, ప్రతి గ్రామంలో అద్బుతమైన పాఠశాల, ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్, స్వామినాథన్ కమిషన్ ప్రకారం సరైన పంటలకు ఎంఎస్పీ నిర్ణయించడం, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా వంటివి ఆరు గ్యారంటీల్లో ఉన్నాయి. ఐదేళ్లలో ఈ హామీలన్ని నెరవేరుస్తామని తెలిపారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) అధినేత శరద్ పవార్, ఆప్ నేత అతిషి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తదితరులు హాజరయ్యారు.

Next Story

Most Viewed