రాజకీయాలకు గుడ్ బై చెబుతారంటూ వార్తలు.. మనసులో మాట బయటపెట్టిన సిద్ధరామయ్య

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-28 10:41:58  IST  )

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య సంచలన, భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించానని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయాలకు గుడ్ బై చెబుతారంటూ వార్తలు.. మనసులో మాట బయటపెట్టిన సిద్ధరామయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం సిద్ధరామయ్య సంచలన, భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలకు అనుగుణంగానే తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించానని ఆయన స్పష్టం చేశారు. గవర్నరు పంపిన తన రాజీనామా పత్రం త్వరలోనే ఆమోదం పొందుతుందనే సంపూర్ణ విశ్వాసంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్నీ గుర్తుచేసుకుంటూ సిద్ధరామయ్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "నేను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాను. భవిష్యత్తులో ఎప్పటికైనా ముఖ్యమంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు. కానీ, 7 కోట్ల కన్నడ ప్రజలకు సేవ చేసే గొప్ప భాగ్యం నాకు దక్కింది. నా రాజకీయ జీవితంలో రాజ్యాంగమే నాకు ధర్మం.. ఓటర్లే నాకు దేవుళ్లు" అనీ ఆయన వ్యాఖ్యానించారు.

రాజ్యసభ ఆఫర్ను తిరస్కరించా..

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసమే తాను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, భవిష్యత్తులో కూడా కర్ణాటక ప్రయోజనాల కోసమే శ్రమిస్తానని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో హైకమాండ్ ఇచ్చిన ఆఫర్‌పై ఆయన స్పందిస్తూ.. "ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే కేంద్ర రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ.. రాజ్యసభకు పంపుతామని హైకమాండ్ నాకు ఆఫర్ ఇచ్చింది. కానీ నాకు ఎలాంటి ఆఫర్లు వద్దని నేను స్పష్టం చేశాను. భవిష్యత్తులో కేవలం ఎమ్మెల్యే గానే కొనసాగుతానని పార్టీ పెద్దలకు చెప్పాను" అని వెల్లడించారు. తాను పదవి నుంచి తప్పుకున్నప్పటికీ రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని సిద్దరామయ్య తేల్చి చెప్పారు. "నా ఒంట్లో ఓపిక ఉన్నన్ని రోజులు ప్రజల మధ్యే ఉంటూ వారికి సేవ చేస్తూనే ఉంటా. నా రాజకీయ సిద్ధాంతాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదు" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కన్నడ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Next Story