న్యూయార్క్ టైమ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనురాగ్ ఠాకూర్

by Disha Web Desk 17 |
న్యూయార్క్ టైమ్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అనురాగ్ ఠాకూర్
X

న్యూఢిల్లీ: భారత్ గురించి న్యూయార్క్ టైమ్స్ అబద్ధం ప్రచారం చేస్తోందని సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై ఆ పత్రిక ప్రచురించిన అభిప్రాయాన్ని ఆయన కల్పితంగా అభివర్ణించారు. భారత్ గురించి ఏదైనా ప్రచురించేటప్పుడు తటస్థంగా ఉండాలన్న విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ ఎప్పుడో వదిలేసింది. కశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛపై ఆ పత్రిక వెల్లడించిన అభిప్రాయం కేవలం దాని వ్యక్తిగతమైంది మాత్రమే. ఎందుకంటే భారత దేశ ప్రజాస్వామ్య విలువల గురించి చెడుగా ప్రచారం చేయడమే దాని ముఖ్య ఉద్దేశం. దాని కొనసాగింపే ఇది.

‘న్యూయార్క్ టైమ్స్‌తో పాటు మరికొన్ని లింక్ మైండెడ్ మీడియా భారత్ గురించి, ప్రధాని మోడీ గురించి చెడుగా ప్రసారం చేస్తున్నాయి. ఈ అబద్దపు ప్రచారాలు ఎక్కువ కాలం కొనసాగవు’ అని మంత్రి ఠాకూర్ ట్వి్ట్టర్‌లో రాశారు. కశ్మీర్‌లో సమాచార ప్రవాహంపై యూఎస్ పత్రిక చేసిన తప్పుడు ఆరోపణల నేపథ్యంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘కొన్ని విదేశీ మీడియా సంస్థలు భారత్‌పై, ప్రధాని నరేంద్ర మోడీపై పగ పెంచుకున్నాయి. భారత ప్రజాస్వామ్యంపై, బహుళ సమాజంపై అబద్దాలను ప్రసారం చేస్తున్నాయి. ఈ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని మంత్రి చెప్పారు. ఇతర ప్రాధమిక హక్కుల మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ కూడా భారత్‌లో పవిత్రమైందని ఠాకూర్ అన్నారు. భారత గడ్డపై తమ వ్యూహాత్మక ఎజెండాను అమలు చేయడానికి భారతీయులు అనుమతించరని మంత్రి చెప్పారు.



Next Story