Indian Army: బార్డర్‌లో మరోసారి సైన్యం స్పెషల్ ఆపరేషన్.. కారణమిదే?

by B.Srinivas |

పహెల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే.

Indian Army: బార్డర్‌లో మరోసారి సైన్యం స్పెషల్ ఆపరేషన్.. కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం (Pahelgam) ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూర్ (Operation sindhoor) పేరుతో పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ టైంలో పాక్ సైతం సరిహద్దుల్లో భారీ షెల్లింగ్‌కు పాల్పడింది. నియంత్రణ రేఖ (LOC) వెంబడి కాల్పులకు తెగపడింది. ఈ క్రమంలో పాక్ జరిపిన కాల్పులు, దాడుల వల్ల సరిహద్దు ప్రాంతాల్లో పేలని బాంబులు, గ్రనేడ్లు, ఇతర మందుగుండు సామగ్రి పడి ఉన్నాయి. అవి పౌరుల భద్రతకు ప్రమాదకరమని భావించిన సైన్యం బార్డర్‌లోని పూంచ్ జిల్లాలో ఆదివారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో 42 షెల్స్ ధ్వంసం చేసింది. స్థానిక పోలీసు అధికారుల సమన్వయంతో పూంచ్ జిల్లాలోని ఝులాస్, సలోత్రి, ధరతి, సలాని సరిహద్దు ప్రాంతాల్లో బాంబులను నిర్వీర్యం చేసింది. పౌర ప్రాణాలకు లేదా ఆస్తికి ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని భద్రతా ప్రోటోకాల్‌లను పాటిస్తూ, అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ చేపట్టామని సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. శిక్షణ పొందిన బాంబు స్క్వాడ్ టీమ్స్, పోలీసుల సాయంతో అన్ని పేలుడు పదార్థాల అవశేషాలను తొలగిస్తున్నామని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ స్థితిని పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది.

కాగా, పూంచ్‌లోని ఎల్‌ఓసీ వెంబడి పాకిస్తాన్ భారీ షెల్లింగ్‌కు దిగడంతో 12 మంది పౌరులు మరణించగా, 42 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ అనంతరం ఇరు దేశాల మధ్య దాడులు ఆగిపోయాయి. దీంతో బార్డర్‌లోని గ్రామాల నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు రావడం ప్రారంభించారు. అయితే పాక్ షెల్లింగ్ వల్ల పేలకుండా ఉండి పోయిన మందుగుండు సామగ్రి వల్ల ప్రజలకు ప్రమాదమని సైన్యం చెబుతోంది. ఈ క్రమంలోనే వాటికి తీసేసేందుకు చర్యలు చేపట్టింది.

Next Story