2030 నాటికి భారత్-యూఏఈ మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం: సీఐఐ అధ్యక్షుడు

by Dishanational1 |
2030 నాటికి భారత్-యూఏఈ మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం: సీఐఐ అధ్యక్షుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-యూఏఈ మధ్య 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 8.3 లక్షల కోట్ల) చమురేతర వాణిజ్యం జరగాలనే లక్ష్యాన్ని అంచనా వేస్తున్నట్టు భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ అధ్యక్షుడు ఆర్ దినేష్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, ఆభరణాలు, ఫార్మా వంటి రంగాలకు రెండు దేశాల్లో పెద్ద ఎత్తున వ్యాపార అవకాశాలు ఉన్న కారణంగా ఈ లక్ష్యం సులభంగా సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 2022, మేలో అమల్లోకి వచ్చిన భారత్, యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు పెరిగాయని చెప్పారు. ఈ ఒప్పందం కింద రత్నాభరణాలు, టెక్స్‌టైల్స్, దుస్తులు, లెదర్, ఫార్మా, వైద్య పరికరాలు, అనేక ఇంజనీరింగ్ ఉత్పత్తుల వంటి లేబర్-ఇంటెన్సివ్ రంగాలకు సుంకం వర్తించదు. దీనివల్ల ఇప్పటికే 2022-23లో ద్వైపాక్షిక ఒప్పందం రూ. 7 లక్షల కోట్లను అధిగమించింది. భారత్‌కు ఉన్న అత్యధిక వినియోగదారులు, పెరుగుతున్న ఉత్పాదక సామర్థ్యం యూఏఈ వస్తువులకు ఆకర్షణీయమైన మార్కెట్‌గా ఉంటుంది. అలాగే, గ్లోబల్ ట్రేడ్ హబ్‌గా యూఏఈ అంతర్జాతీయ మార్కెట్లకు భారత ఎగుమతులను సులభతరం చేస్తుందని దినేష్ వివరించారు. వీటికి తోడు ఇటీవల యూఏఈలో రూపే కార్డు ఆమోదం పొందడంతో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత వేగంగా వృద్ధి చెందడానికి అవకాశాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.


Next Story