19 మంది పాక్ నావికులను కాపాడిన భారత్: 36గంటల్లోనే రెండో ఆపరేషన్

by Dishanational2 |
19 మంది పాక్ నావికులను కాపాడిన భారత్: 36గంటల్లోనే రెండో ఆపరేషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: సముద్రపు దొంగల నుంచి 19 మంది పాకిస్థానీ నావికులను భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్ర రక్షించింది. ఆఫ్రికాలోని సోమాలియాకు తూర్పున ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు ఇండియన్ నేవీ మంగళవారం తెలిపింది. అరేబియా సముద్రంలో ఇరాన్ జెండాతో కూడిన షిప్పింగ్ నౌక ఆల్ నయిమీని 11 మంది సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. నౌకలో ఉన్న 19 మంది పాకిస్థానీయులను బంధీలుగా పట్టుకున్నారు. దీంతో ఐఎన్ఎస్ సుమిత్రకు మరో షిప్ నుంచి ప్రమాద కాల్ రావడంతో భారత నేవీ వేగంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ నిర్వహించి పాకిస్థానీ సిబ్బందిని, నౌకను కాపాడింది. రెస్క్యూ ఆపరేషన్ అనంతరం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఇది 36 గంటల్లోనే యుద్ధనౌక చేపట్టిన రెండో యాంటీ పైరసీ ఆపరేషన్ కావడం గమనార్హం. అంతకు ముందు ఓ మత్స్యకార నౌకను రక్షించి 17 మంది సిబ్బందిని రక్షించారు. ఈ రెండు ఆపరేషన్లు కేరళలోని కొచ్చికి పశ్చిమాన 1574 కిలోమీటర్ల దూరంలో జరగడం గమనార్హం.

ఇటీవలి భారత నేవీ ఆపరేషన్లు

ఉత్తర, మధ్య అరేబియా సముద్రంతో సహా కీలకమైన సముద్ర మార్గాల్లో ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం భారత నావికాదళం ఇప్పటికే నౌకలు,నిఘా విమానాల విస్తరణను మెరుగుపరిచింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 5న ఉత్తర అరేబియా సముద్రంలో లైబీరియన్ జెండాతో కూడిన ఎంవీ లీలా నార్ఫోక్ నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని అడ్డుకుని అందులోని సిబ్బందిని రక్షించింది. అలాగే గతేడాది డిసెంబర్ 23న లైబీరియన్ జెండాతో కూడి ఎంపీ కెమ్ ప్లూటో ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడికి గురికాగా ఈ నౌకలో ఉన్న 25మంది భారతీయులను కాపాడింది.

‘ఐఎన్ఎస్ సుమిత్ర’ విశేషాలు

ఐఎన్ఎస్ సుమిత్ర అనేది భారత్‌కు చెందిన యుద్ధనౌక. దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ రూపొందించింది. ఇది భారత నేవీకి నాలుగో పెట్రోలింగ్ నౌక. సముద్ర నిఘాలో కీలక పాత్ర పోషిస్తుంది. 105 మీట్ల పొడవు ఉండే ఈ నౌకను 2014 సెప్టెంబర్ 4న చెన్నయ్‌లో నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ ఆర్ కే ధోవన్ నౌకాదళంలోకి ప్రవేశింపజేశారు. తాజాగా తూర్పు సోమాలియా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ జలాల్లో యాంటీ పైరసీ, సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మోహరించారు.



Next Story

Most Viewed