ఆ నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్యే పోటీ..ఎక్కడ?

by Dishanational2 |
ఆ నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్యే పోటీ..ఎక్కడ?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో పార్లమెంటు ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలోని చికిటీ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ప్రధాన పార్టీల తరఫున బరిలో నిలవడమే అందుకు కారణం. గంజాం జిల్లాలో ఉన్న చికిటి సెగ్మెంట్‌లో మనోరంజన్ ద్యన్ సమంతరాయ్‌, రవీందనాథ్ ద్యన్ సమంతరాయ్‌ అనే ఇద్దరు బ్రదర్స్ పోటీలో ఉన్నారు. ఇక్కడ తమ్ముడు మనోరంజన్ బీజేపీ తరఫున బరిలో ఉండగా..అన్న రవీందనాథ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపై అందరి దృష్టి పడింది. కాగా, వీరిద్దరూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతామణి ద్యన్ సామంతరాయ్ కుమారులు. చింతామణి ఈ సెగ్మెంట్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థిగా ఒకసారి కాంగ్రెస్ తరఫున గెలుపొందారు.

మనోరంజన్ ద్యన్ ఈ నియోజకవర్గంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో కాంగ్రెస్ తరఫున, 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రవీందనాథ్ మొదటి సారి పోటీ చేస్తున్నారు. చికిటి అసెంబ్లీ స్థానం నుంచి బిజూ జనతా దళ్ తరఫున రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉషాదేవి కుమారుడు చిన్మయానంద శ్రీరూప్ దేబ్‌ను తన అభ్యర్థిగా ప్రకటించింది. ఉషాదేవి ఐదుసార్లు ఈ స్థానం నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ టికెట్ వచ్చిన సందర్భంగా రవీందనాథ్ మాట్లాడుతూ..పార్టీలో ఎంతో కాలంగా చురుగ్గా పనిచేసినందు వల్లే టికెట్ వచ్చిందని తెలిపారు. ఇది అన్నదమ్ముల మధ్య పోటీ కాదని..రెండు సిద్ధాంతాల మధ్య పోటీ అని తెలిపారు. ఈ ఎన్నికలు తమ కుటుంబ సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని తెలిపారు.

Next Story

Most Viewed