మోడీ మరోసారి గెలిస్తే దేశం 200ఏళ్లు వెనక్కి వెళ్తుంది: తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు

by Dishanational2 |
మోడీ మరోసారి గెలిస్తే దేశం 200ఏళ్లు వెనక్కి వెళ్తుంది: తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం 200ఏళ్లు వెనక్కి వెళ్తుందని ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘మోడీ మళ్లీ ప్రధాని అయితే దేశ చరిత్ర తిరగ రాస్తారు. అంతేగాక సైన్స్ కూడా వెనక్కి నెట్టివేయబడుతుంది. మూఢనమ్మకాలతో కూడిన కథలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఆర్ఎస్ఎస్ నియమాలతో భర్తీఅవుతుంది’ అని వ్యాఖ్యానించారు. దీనిని ఆపాలంటే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ఒక్కటే మార్గమని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే తమిళనాడు శత్రువులకు ఓటు వేసినట్టేనని విమర్శించారు. అలాగే ఏఐఏడీఎంకేకు ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్టేనని స్పష్టం చేశారు. ఎందుకంటే ఏఐఏడీఎంకే. బీజేపీలు చిరకాల మిత్రులు. కానీ వారు ప్రస్తుతం విడిపోయినట్టు వ్యవహరిస్తున్నారు అని ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి తనకు అనేక అవార్డులు వచ్చాయని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘బానిసలలో ఉత్తముడు’గా పళనిస్వామికి అవార్డులు వచ్చాయని అన్నారు. ఇండియా కూటమిని ప్రజలు విశ్వసిస్తారని దీమా వ్యక్తం చేశారు.


Next Story

Most Viewed