జామా మసీద్లోకి ఆడవాళ్లకు ఎంట్రీ లేదు.. కారణమిదే!

by Disha Web Desk 14 |
జామా మసీద్లోకి ఆడవాళ్లకు ఎంట్రీ లేదు.. కారణమిదే!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఉన్న జామా మసీద్ లోనికి మహిళలకు అనుమతి నిరాకరిస్తూ మసీద్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మసీద్ మెయిన్ గేట్లపై నోటీసులను అంటించారు. తాజాగా ఈ వ్యవహారంపై షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ స్మందించారు. మహిళలను మసీద్ లోనికి అనుమతించకపోవడానికి గల కారణాలు వెల్లడించారు. మసీద్ అనేది పవిత్రమైన ప్రార్థన స్థలమని, కానీ కొంతమంది యువతులు, మహిళలు మసీద్ పవిత్రతను దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మసీద్ ను కొంత మంది యువతులు తమ బాయ్ ఫ్రెండ్స్ (డేట్స్) ను కలుసుకునే స్థలంగా మార్చారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేశారు. మసీద్, గుడి, గురుద్వార లాంటి స్థలాలు ప్రార్థన కోసమేనని, నిజంగా ప్రార్థన కోసం వచ్చిన వాళ్లకు మసీద్ లో తప్పకుండా ప్రవేశం ఉంటుందని చెప్పారు.

ఇవాళ ప్రార్థన కోసం వచ్చిన దాదాపు 25 మంది బాలికలను మసీద్ లోనికి అనుమతించామని షాహి ఇమామ్ తెలిపారు. అయితే మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటూ మసీద్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని మహిళలు వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలివాల్ ఈ వ్యవహరంపై మండిపడ్డారు. ఈ నిర్ణయం మహిళల హక్కులను కాలరాసేదిగా ఉందని ఆరోపించారు. దేవుడి విషయంలో మగవాళ్లకున్న హక్కులే ఆడవాళ్లకు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయంలో తక్షణమే విచారణ జరపాలని, మహిళలను మసీద్ లోకి అనుమతించేలా చర్యలు తీసుకోవాలంటూ అక్కడి ప్రభుత్వానికి, మసీద్ అధికారులకు నోటీసులు పంపారు.Next Story