తీహార్ జైలులో కేజ్రీవాల్.. కవిత, ఇతర ఆప్ నేతలు ఈ జైలులో ఎక్కడున్నారంటే ?

by Dishanational4 |
తీహార్ జైలులో కేజ్రీవాల్.. కవిత, ఇతర ఆప్ నేతలు ఈ  జైలులో ఎక్కడున్నారంటే ?
X

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీ గడువు ముగియడంతో ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో ఆయనను సోమవారం సాయంత్రం హస్తినలోని తీహార్ జైలుకు తరలించారు. ఇప్పటికే ఈ జైలులో లిక్కర్ స్కాం నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా జ్యుడీషియల్ కస్టడీపై ఉన్నారు. ఇప్పుడు కేజ్రీవాల్ కూడా ఏప్రిల్ 15 వరకు ఇదే జైలులో ఉండబోతున్నారు. మందులు, పుస్తకాలను కేజ్రీవాల్ తీసుకెళ్లడానికి అనుమతించాలని తీహార్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్ సౌకర్యార్ధం జైలులోని సెల్‌లో ఒక టేబుల్, ఒక కుర్చీని ఏర్పాటు చేయడంతో పాటు వైద్యులు సూచించిన విధమైన ఆహారాన్ని అందించాలని తెలిపింది. మతపరమైన లాకెట్‌ను ధరించేందుకు ఆప్ చీఫ్‌కు అవకాశం కల్పించాలని కోర్టు చెప్పింది. కేజ్రీవాల్ రిక్వెస్ట్ మేరకు భగవద్గీత, రామాయణం, నీర్జా చౌదరి రచించిన ‘‘హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్డ్’’ అనే పుస్తకాలను జైలుకు తీసుకెళ్లేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇక కేజ్రీవాల్ విచారణ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ కీలక నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్ కోర్టు గదిలోనే ఉన్నారు.

నంబర్ 2 జైలులో ఢిల్లీ సీఎం

తీహార్ జైలులోని నంబర్ 2 జైలులో ఉన్న ప్రత్యేక సెల్‌లో కేజ్రీవాల్‌ను ఒంటరిగానే ఉంచుతారని తెలుస్తోంది. ప్రస్తుతం తీహార్ జైలులోని 6వ నంబరు జైలులో ఎమ్మెల్సీ కవిత ఉన్న సెల్‌లో మరో ఇద్దరు మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ 5వ నంబరు తీహార్ జైలులో, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా 1వ నంబరు జైలులో, ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ 7వ నంబర్ జైలులో ఉన్నారు.

తీహార్ జైలులో కేజ్రీవాల్ ఎలా ఉండబోతున్నారు ?

* తీహార్ జైలులోని ఖైదీలంతా ఒకే విధమైన రొటీన్‌ను అనుసరిస్తారు.

* కేజ్రీవాల్, ఇతర ఖైదీలు సూర్యోదయంతోనే తమ రోజును ప్రారంభిస్తారు.ఉదయం 6:30 గంటలకే వీరికి అల్పాహారం, టీ, కొన్ని బ్రెడ్ ముక్కలను అందిస్తారు.

* ఉదయం 10:30 గంటల నుంచి 11 గంటల మధ్య పప్పు, ఒక సబ్జీ, ఐదు రోటీలు లేదా అన్నంతో కూడిన భోజనం అందిస్తారు.

* మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల మధ్య ఖైదీలను వారి సెల్‌లకే పరిమితం చేస్తారు.

* మధ్యాహ్నం 3:30 గంటలకు వారికి ఒక కప్పు టీ, రెండు బిస్కెట్లు ఇస్తారు.

* సాయంత్రం 4 గంటలకు ఖైదీలను వారి న్యాయవాదులు కలవొచ్చు.

* సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఖైదీలంతా సెల్‌లోనే ఉంటారు.

* వైద్య సహాయం నిరంతరం అందుబాటులో ఉంటుంది. ప్రత్యేకించి కేజ్రీవాల్‌కు షుగర్ ఉన్నందున.. జైలులో ఆయనకు రెగ్యులర్ చెకప్‌లు చేయనున్నారు.

* ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వారానికి రెండుసార్లు తన కుటుంబ సభ్యులను కలవొచ్చు. అయితే, జైలు భద్రతా విభాగం క్లియరెన్స్ ఇచ్చిన వారిని మాత్రమే కేజ్రీవాల్ కలవాల్సి ఉంటుంది.

* కేజ్రీవాల్ భోజన సమయాల్లో, సెల్‌లో ఉంచిన సందర్భాల్లో తప్ప మిగతా టైంలలో టీవీ చూడొచ్చు.

* వార్తలు, క్రీడలు, వినోదానికి సంబంధించిన దాదాపు 20 ఛానళ్లు టీవీలో వస్తాయి.

Next Story