వరద గుప్పిట్లో అస్సాం.. జలదిగ్భంధంలో 142 గ్రామాలు

by Dishafeatures2 |
వరద గుప్పిట్లో అస్సాం.. జలదిగ్భంధంలో 142 గ్రామాలు
X

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లో తీరం దాటిన బిపర్జాయ్ తుఫాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ప్రస్తుతం రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు వచ్చి బర్మేర్, సిరోహి, జలోర్ ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటివరకూ రాజస్థాన్ లో ఐదుగురు మృతిచెందారు. మరోవైపు అస్సాంలోనూ ఆదివారం అర్థరాత్రి నుంచీ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జోర్హాట్ జిల్లాలో ఉన్న నిమ్తి ఘాట్ వద్ద బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. అనేక రోడ్లు, వంతెనలు, పాఠశాలలు వరదల్లో మునిగిపోయాయి. 142 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి.

కొండచరియలు విరిగిపడి ఒకరు, ఇంటిగోడ కూలి మరొకరు మృతిచెందారు. 1500 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.వరద ముప్పు పొంచి ఉన్న వివిధ ప్రాంతాల నుంచి 34 వేలమందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా తరలించిన వారిలో ఎక్కువ మంది లఖింపూర్‌ (25,200), దిబ్రూఘర్ (3,800), టిన్సుకియా(2,700) ప్రాంతాలవారే ఉన్నారు. గురువారం(జూన్ 22) వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. వాతావరణశాఖ అస్సాంకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో..

తమిళనాడులో కూడా వానలు పడుతున్నాయి. చెన్నై నగరం, శివారు ప్రాంతాల్లో ఆదివారం నుంచీ వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, వేలూరు, రాణిపేట్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పైకి నీరు చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 విమానాలను బెంగళూరుకు మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.



Next Story