అరెస్ట్ భయం.. మరో సారి కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

by Disha Web Desk 4 |
అరెస్ట్ భయం.. మరో సారి కోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ విచారణకు హాజరుకావడానికి సిద్ధంగా ఉన్నామని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు. కానీ ఈడీ తనను అరెస్టు చేయబోనని హామీ ఇవ్వాలని చెప్పారు. ఈ మేరకు ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ దీనిపై విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్‌కు ఈనెల 17న ఈడీ 9వ సారి సమన్లు జారీ చేయగా.. గురువారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. దీంతో కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. అంతకుముందు కూడా ఈడీ సమన్లను హైకోర్టులో కేజ్రీవాల్ సవాల్ చేయగా..దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు వరుస సమన్లు జారీచేయడంపై సమాధానం ఇవ్వాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ మరో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

అరెస్టు భయంతోనేనా?

అయితే తనను అరెస్టు చేస్తారనే పక్కా సమాచారం మేరకే కేజ్రీవాల్ హడావిడిగా కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈడీ నోటీసులు జారీ చేస్తుందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ కోర్టుకు తెలిపారు. అధికార పార్టీపై నిరంతరం విమర్శలు చేయడంలో కేజ్రీవాల్ ముందున్నారని, అంతేగాక ఇండియా కూటమిలోనూ కీలక భాగస్వామిగా ఉన్నాడని, కాబట్టి అరెస్టు చేసే ఉద్దేశంతోనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజా పరిణామాలపై ఢిల్లీ మంత్రి అతిశీ స్పందించారు. ఈడీ ఉద్దేశం స్పష్టంగా ఉంటే, సీఎంను అరెస్టు చేయబోమని కోర్టులో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కా్మ్ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఢిల్లీ జల్ బోర్డు కేసులోనూ ఈడీ కేజ్రీవాల్‌కు ఈనెల 17న సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణకు సైతం కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.


Next Story

Most Viewed