ప్రముఖ ఉగాండా అథ్లెట్ హత్య!

by Dishanational2 |
ప్రముఖ ఉగాండా అథ్లెట్ హత్య!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగాండాకు చెందిన ప్రముఖ అథ్లెట్ బెంజమిన్ కిప్లగాట్ కెన్యాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కెన్యాలోని ఎల్డోరెట్ రిఫ్ట్ వ్యాలీ పట్టణ శివార్లలో ఓ కారులో కిప్లగాట్ మృతదేహం లభ్యమైంది. అతని మెడపై ఉన్న గాయం కత్తితో పొడిచినట్టుగా ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు కిప్లాగట్ ఎల్డోరెట్ ప్రాంతంలో శిక్షణ పొందుతున్నట్టు తెలుస్తోంది. కాగా, కెన్యాలో జన్మించిన కిప్లగాట్ ఒలంపిక్ క్రీడలు, ప్రపంచ చాంపియన్ షిప్‌లలో ఉగాండా తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2008 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో రజత పతకాన్ని, 2012లో ఆఫ్రికా చాంపియన్‌షిప్‌లో కాంస్యాన్ని గెలుచుకున్నాడు. మరోవైపు కిప్లగాట్ మరణంపై సహచర అథ్లెట్లు దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. బెంజమిన్ మృతి విచారకరమని గ్లోబల్ అథ్లెటిక్స్ గవర్నింగ్ బాడీ ఎక్స్‌లో పోస్టు చేసింది. ‘అంతర్జాతీయ వేదికలపై మాకు ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్‌ను కోల్పోవడం బాధాకరం. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ఉగాండా క్రీడల మంత్రి పీటర్ ఓగ్వాంగ్ తెలిపారు.



Next Story

Most Viewed