సొంత ఇలాకాలో కేటీఆర్ కు చేదు అనుభవం!.. నిలదీసిన మహిళా రైతు

by Disha Web Desk 5 |
సొంత ఇలాకాలో కేటీఆర్ కు చేదు అనుభవం!.. నిలదీసిన మహిళా రైతు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన సొంత ఇలాక అయిన సిరిసిల్ల పట్టణంలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. తమ భూమి తీసుకొని తమకు ఎటువంటి పరిహారం చెల్లించలేదని ఓ మహిళా రైతు కేటీఆర్ ను ప్రశ్నించింది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన బోనాల లక్ష్మమ్మ అనే మహిళా రైతు తనకున్న రెండు ఎకరాల భూమి పెద్దూరు శివారులోని మెడికల్ కళాశాల కొరకు ప్రభుత్వం తీసుకోవడంతో పట్టణంలో కాయగూరలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో భాగంగా అటుగా వెళ్లిన కేటీఆర్ ను తన భూమి తనకు ఇప్పించాలని అడిగింది. తన భూమికి బదులుగా ప్లాట్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది.

దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పిస్తానని చెప్పినా వినకుండా.. ఇంకా ఎన్ని రోజులకు అని నిలదీసింది. తాము వ్యవసాయం చేసుకునే భూమిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం ప్లాట్ ఇప్పిస్తానని చెప్పి ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. దీంతో కేటీఆర్ ప్రభుత్వానికి మీరు భూమి ఇచ్చారు. దానికి బదులుగా ప్రభుత్వం కూడా మీకు భూములు కేటాయిస్తుందని అన్నారు. అలాగే మార్కెట్ లో సెక్యూరిటీ లేకపోవడం వల్ల కొందరు మాపై దౌర్జన్యాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని నిలువరించాలని కోరింది. కాగా బీఆర్ఎస్ అధికారంలో ఉండగా సిరిసిల్ల నియోజకవర్గంలోని పెద్దూరు శివారులో నిర్మించ తలపెట్టిన మెడికల్ కళాశాల భవనం కొరకు చేపట్టిన భూ సేకరణలో భాగంగా తనకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కోల్పోయింది. దీనికి బదులుగా పట్టణ శివార్లలో ఇళ్ల కోసం పట్టా భూములు ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చి, భూమి కోల్పోయిన రైతులకు వాటిని ఇప్పటికీ కేటాయించనట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed