చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. కోర్టుల జోక్యానికి నో ఛాన్స్: హోం మంత్రి అమిత్ షా

by Disha Web Desk 17 |
చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. కోర్టుల జోక్యానికి నో ఛాన్స్: హోం మంత్రి అమిత్ షా
X

న్యూఢిల్లీ: చట్టాల డ్రాఫ్టింగ్ ప్రక్రియపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. “చట్టాన్ని చక్కగా రూపొందిస్తే.. దానిలోకి కోర్టులు జోక్యం చేసుకునే అవకాశమే ఉండదు. చట్టాల ముసాయిదా ప్రతులను డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు చోటుచేసుకునే లోపాల వల్లే ఈ తరహా జోక్యానికి ఛాన్స్ కలుగుతుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. చట్టం అనేది క్యాబినెట్ రాజకీయ సంకల్పాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు.

పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల అధికారులకు శాసన ముసాయిదా సూత్రాల రూపకల్పనపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌స్టిట్యూషనల్ అండ్ పార్లమెంటరీ స్టడీస్ (ICPS), పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ (PRIDE) సంయుక్తంగా పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని అమిత్ షా ప్రారంభించారు.

సరళమైన భాషలో, స్పష్టమైన పదాలతో చట్టాల రచన చేస్తే.. కోర్టుల జోక్యానికి, ఇతరత్రా వివాదాలు తలెత్తడానికి ఛాన్స్ ఉండదన్నారు. కఠినమైన పదాలతో రూపొందించిన చట్టం ఎప్పుడూ వివాదాలను సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. “చట్టాల డ్రాఫ్టింగ్ అనేది ఆర్ట్స్ కాదు.. సైన్స్ కాదు.. చట్టాల రచన అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ.. ఈ విభాగంలో ఉన్నవారు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి. అలా చేయడంలో విఫలమయ్యే వాళ్లకు విలువ ఉండదు" అని షా చెప్పారు.

" రాజ్యాంగంలోని అధికరణాలు(ఆర్టికల్స్) అనేవి పర్మినెంట్. కానీ జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తి కి సంబంధించిన ఆర్టికల్ 370 గురించి "టెంపోరరీ"(తాత్కాలికం) అనే పదాన్ని కొందరు తెలివిగా చేర్చారు. భారత రాజ్యాంగ సభలోనూ దానిపై చర్చ జరిగినట్లు రికార్డులు కూడా లేవు. దేశ ప్రజలకు అక్కరలేని అలాంటి టెంపోరరీ ఆర్టికల్ 370ని పర్మినెంట్ గా కొనసాగించలేక మేం రద్దు చేశాం" అని అమిత్ షా వివరించారు.

Next Story