ఉత్తరాది మహిళలపై డీఎంకే ఎంపీ దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం

by Naga Rani Yarlagadda |

కేంద్రమాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్.. ఉత్తరాది మహిళలను తమిళ మహిళలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి.

ఉత్తరాది మహిళలపై డీఎంకే ఎంపీ దయానిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమాజీ మంత్రి, డీఎంకే ఎంపీ దయానిధి మారన్.. ఉత్తరాది మహిళలను తమిళ మహిళలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ఈ వ్యాఖ్యలు మాటలయుద్ధానికి దారితీశాయి. చెన్నైలోని క్వాయిద్-ఎ-మిల్లత్ గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీలో నిన్న (మంగళవారం) కార్యక్రమంలో దయానిధి మారన్ ముఖ్య అతిథుల్లో ఒకరిగా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న "ఉలగమ్ ఉంగళ్ కైయిల్" అనే పథకం కింద ఫైనల్ ఇయర్ చదువుతున్న 900 మంది విద్యార్థినులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దయానిధి మారన్ మాట్లాడుతూ.. తమిళనాడులో ద్రావిడ్ మోడల్ పాలనవల్ల మహిళా విద్యకు అధిక ప్రాధ్యానం ఉందని, పెరియార్, కరుణానిధి, సీఎం స్టాలిన్ వంటి నేతలు చేసిన కృషి కారణంగానే ఇక్కడి అమ్మాయిలు ఉన్నత చదువులు చదువుతున్నారని కొనియాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అమ్మాయిలను ఉద్యోగాలకు పంపకుండా ఇంట్లోనే ఉండి పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తారన్నారు. తమిళనాడులో మాత్రం మహిళల అభ్యున్నతికి ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. పైగా అక్కడ ఇంగ్లీషు నేర్చుకుంటే బానిసలవుతారని చెప్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దయానిధి మారన్ కు కనీస ఇంగిత జ్ఞానం లేదని ఆ పార్టీ నేత తిరుపతి నారాయణన్ అన్నారు. ఆయన ఉత్తరాది మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వెంటనే ఉత్తరాది మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరో నేత అనిలా సింగ్.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ద్రౌపది ముర్ము వంటి వారిని చూపించి మారన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుపట్టారు.

Next Story