మహిళా బిల్లుపై చర్చ.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
మహిళా బిల్లుపై చర్చ.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో కేంద్రం ప్రవేశ పెట్టిన 'నారీశక్తి వందన్ అధినియమ్' మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఈ బిల్లుపై సభలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికైనా చర్చకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ చర్చలో పాల్గొనడం తన జీవితంలో ఒక భావోద్వేగ ఘట్టం అన్నారు. ఈ బిల్లును తీసుకురావడంతో రాజీవ్ గాంధీ స్వప్నం నెరవేరింది. రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించారు.

మహిళా బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా బిల్లును ఇంకా ఆలస్యం చేయడమంటే స్త్రీలను అవమానపర్చడమే అన్నారు. రాజ్యసభలో మొదటిసారి మహిళా బిల్లును ప్రవేశపెట్టింది తమ పార్టీనే అని గుర్తు చేశారు. ఆధునిక భారత నిర్మాణంలో పురుషులతో కలిసి మహిళలు పోరాడారని, వంటిల్లు నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. మహిళా బిల్లు కోసం దశాబ్దాలుగా పోరాడుతున్నామన్నారు. గతంలో ఈ బిల్లును అడ్డుకున్నారని చెప్పారు. మహిళలు వారి స్వార్థం గురించి ఏనాడు ఆలోచించరని, స్త్రీల త్యాగాలు ఎనలేనివన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు.


Next Story

Most Viewed