బ్రిజ్ భూషణ్ పై పోక్సో కేసు ఎత్తివేత..?

by Javid Pasha |
బ్రిజ్ భూషణ్ పై పోక్సో కేసు ఎత్తివేత..?
X

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు పోక్సో కేసును ఎత్తి వేయాలని కోర్టుకు సూచించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ కేసుకు సంబంధించి వెయ్యి పేజీల చార్జిషీట్ ను ఢిల్లీ పోలీసులు గురువారం రూస్ అవెన్యూ జిల్లాలోని మెజిస్ట్రీయల్ కోర్టులో దాఖలు చేశారు. బ్రిజ్ భూషణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రెజ్లర్లు ఆ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద కొన్ని నెలలుగా నిరసన చేపట్టిన రెజ్లర్లతో చర్చలు జరిపిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 15వ తేదీలోపు చార్జిషీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్ పై రెండు నాన్ బెయిలబుల్, ఒక బెయిలబుల్ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు.

అయితే.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవడంతో పోక్సో కేసు రద్దు చేయాలని చార్జిషీట్ లో పేర్కొన్నారు. తనను జట్టులోకి ఎంపిక చేయకపోవడం వల్లే బ్రిజ్ భూషణ్ పై లైంగిక ఆరోపణలు చేసినట్లు మైనర్ రెజ్లర్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పోలీసులు తమ చార్జిషీట్ లో పొందుపర్చారు. రెజ్లింగ్ సమాఖ్య అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్ పై కూడా పోలీసులు చార్జిషీట్ పెట్టారు. ఈ రిపోర్టుపై జూలై 4వ తేదీన విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అనురాగ్ ఠాకూర్ హమీ మేరకు రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ పదవికి జూలై 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితుల్లో ఎవరూ పోటీ చేయరాదని షరతు విధించినట్లు సమాచారం.

బ్రిజ్ భూషణ్ ను రక్షిస్తున్న ఢిల్లీ పోలీసులు

బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్ పై పలువురు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ ను రక్షించేందుకే ఆయనపై బలహీనమైన సెక్షన్లతో చార్జిషీట్ దాఖలు చేశారని రెజ్లర్లు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ఒత్తిడి మేరకే మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన కీలకమైన పోక్సో కేసును రద్దు చేయాలని సిఫారసు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ బాలికను, ఆమె తండ్రిని బెదిరింపులకు గురి చేసి లైంగిక వేధింపులు జరగలేదని రెండోసారి స్టేట్ మెంట్ ఇప్పించారని విమర్శించారు. బ్రిజ్ భూషణ్ ను ప్రధాని మోడీ కాపాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సుప్రియా శ్రీనాథ్ ఆరోపించారు.



Advertisement

Next Story

Most Viewed