10,000 మార్క్ దాటిన యాక్టివ్ కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

by Disha Web Desk 12 |
10,000 మార్క్ దాటిన యాక్టివ్ కేసులు.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో కరోనా అలజడి రేపుతుంది. అదుపులో ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో 56,551 మందిని పరీక్షించగా...1,805 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఆదివారం కూడా అదే స్థాయి(1,890)లో కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది. కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 10,000 మార్కు దాటాయి. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. నిన్న ఆరుగురు మరణించారు. ఇప్పటివరకు 4.47 కోట్ల మందికి కరోనా సోకగా, 5.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది. అయితే, రోజువారీ కొత్త కేసుల సంఖ్య 1000కి పైగా నమోదవుతుండటంతో కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అత్యధిక సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో, నేడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటం ఇదే ప్రథమం. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది.

Next Story

Most Viewed