ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు

by Disha Web Desk 12 |
ప్రభుత్వ కార్యాలయాల పని వేళల్లో మార్పులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యుత్ ఆదా చేయడం కోసం పంజాబ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త సమయం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. మార్చి 2వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 7.30 గంటలకు తెరిచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ శాఖల పని వేళలను ఇంతకు ముందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండేది. ఈ పనివేళలు జూలై 15 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. దీంతో మంగళవారం ఉదయం 7.28 గంటలకే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన సిబ్బందితో కలిసి సెక్రటేరియట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ముందు, తాను ఉద్యోగులు, ప్రజలతో మాట్లాడారని, వారు అంగీకరించారని భగవంత్ మాన్ అన్నారు.

ఈ చర్య విద్యుత్‌ను ఆదా చేయడంలో దోహదపడుతుందని, "విద్యుత్ అనేది ఒక పెద్ద సమస్య" అని ఆయన అన్నారు. విద్యుత్ శాఖ ప్రకారం, పీక్ వినియోగ సమయం మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని, కొత్త సమయంతో లోడ్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం 2 గంటలకు మూసివేసి, ఆవరణలోని విద్యుత్ ఉపకరణాలను మూసివేస్తే, రోజుకు దాదాపు 350 మెగావాట్ల వినియోగం తగ్గుతుందన్నారు. ఫలితంగా విద్యుత్ బిల్లులపై నెలకు రూ. 16 నుంచి 17 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. తద్వార రెండున్నర నెలల వ్యవధిలో రూ. 40 నుంచి 42 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు.

విద్యుత్ కొరత వల్ల ఈ నిర్ణయం తీసుకోలేదని, విద్యుత్ ఆదా చేయడం కోసమే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 7.30 గంటలకు కార్యాలయాలు తెరిచినప్పుడు, ప్రజలు కూడా ఉదయాన్నే తమ పనిని పూర్తి చేసుకోవచ్చని, అప్పుడు వారు తమ దినచర్య, ఇతర పనులకు హాజరుకావచ్చని, ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయన చెప్పారు. స్కూల్ పిల్లలు ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోకుండా పాఠశాల సమయానికి అనుగుణంగా వీటిని సెట్ చేసినట్లు చెప్పారు. ట్రాఫిక్ సమస్య ఉన్న ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇటువంటి చర్యలను అమలు చేయడం వల్ల పరిస్థితిని తగ్గించవచ్చన్నారు. ఈ ప్రయోగం వల్ల మరికొన్ని రాష్ట్రాలు కూడా లాభ పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. జూలై 15 తర్వాత పొడిగించవచ్చా అనే దానిపై.. ఈ చర్య ఫలితాలను చూసి.. మరోసారి ఉద్యోగులు, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు.



Next Story

Most Viewed