కాశ్మీర్‌లో జీ20 సదస్సు.. భద్రతకు యాంటీ-డ్రోన్ టెక్‌తో ప్రత్యేక బలగాలు

by Disha Web Desk 13 |
కాశ్మీర్‌లో జీ20 సదస్సు.. భద్రతకు యాంటీ-డ్రోన్ టెక్‌తో ప్రత్యేక బలగాలు
X

న్యూఢిల్లీ: మే 22 నుంచి 24 వరకు కాశ్మీర్ లోని శ్రీనగర్‌ వేదికగా భారత్ అధ్యక్షతన జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది. ఇటువంటి కీలక తరుణంలో గత వారం పూంచ్‌ లో జరిగిన ఉగ్రదాడి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. జీ20 సమావేశానికి ముందు కాశ్మీర్ లో భద్రతా పరిస్థితిని సమీక్షించడానికి కేంద్ర హోం శాఖ ఒక బృందాన్ని అక్కడికి పంపనుంది. యాంటీ డ్రోన్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేక బలగాలను శ్రీనగర్‌ లో మోహరించనున్నారు.

"రాబోయే జీ20 సమావేశం, అమర్‌నాథ్ యాత్ర కోసం మేం జాతీయ రహదారి భద్రతా ప్లాన్ ను తయారు చేశాం. ఈ విషయంలో అన్ని భద్రతా ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి" అని కాశ్మీర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్ లో మే 22, 23 తేదీల్లో జీ20 సదస్సు జరుగనుంది. ఇవి ముగిశాక మే 24న జీ20 దేశాల టూరిజం వర్కింగ్ గ్రూప్ లోని ప్రతినిధులను శ్రీనగర్‌లోని దాల్ లేక్ , గుల్‌మార్గ్ స్కీ-రిసార్ట్‌తో సహా కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు తీసుకువెళతారు. వారు మే 25న తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

చైనా మినహా అన్ని జీ20 సభ్య దేశాల ప్రతినిధులు శ్రీనగర్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పూంచ్ ఘటన తరహాలోనే.. జీ20 సదస్సు సందర్భంగానూ ఉగ్రవాదులు కశ్మీర్ లో కారు బాంబు (VBIED) పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందిందని, వాటిని నిలువరించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కాశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.



Next Story

Most Viewed