కుల్గాంలో 40 గంటల ఆపరేషన్..ముగ్గురు ఉగ్రవాదులు హతం

by Dishanational2 |
కుల్గాంలో 40 గంటల ఆపరేషన్..ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం వెల్లడించింది. సోమవారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ గురువారం ఉదయం ముగిసినట్టు తెలిపింది. అంతకుముందు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం బుధవారం అర్ధరాత్రి మరొక ఉగ్రవాదిని కాల్చిచంపినట్టు పేర్కొంది. ‘కుల్గాంలోని రెడ్‌వానీ పయీన్‌లోని సాధారణ ప్రాంతంలో మే 06 న ప్రారంభమైన జాయింట్ ఆపరేషన్.. దాదాపు 40 గంటల పాలు కొనసాగింది. ఇందులో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించాం’ అని భారత్ సైన్యం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. కశ్మీర్‌లో శాంతి భద్రతలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

హతమైన ఉగ్రవాదుల్లో లష్కరే టాప్ కమాండర్ బాసిత్ దార్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కశ్మీర్‌లో పలువురి హత్యకు ఆయన కుట్రపన్నినట్టు ఆరోపణలున్నాయి. అలాగే మోమిన్ గుల్జార్, ఫహీమ్ అహ్మద్ బాబా అనే ఇద్దరు ఎల్‌ఈటీ ఉగ్రవాదులు కూడా ఈ ఆపరేషన్‌లో హతమయ్యారు. వీరిద్దరూ ఉగ్రవాదులకు సహాయం చేసేవారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ నెల 4వ తేదీన పూంచ్‌లో వైమానిక దళ సైనికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ జవాన్ మరణించగా..మరో నలుగురు జవాన్లు గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ చేపట్టిన ఇండియన్ ఆర్మీ ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చింది.

Next Story

Most Viewed