షాజహాన్‌ను సీబీఐ, ఈడీలు కూడా అరెస్టు చేయొచ్చు : హైకోర్టు

by Dishanational4 |
షాజహాన్‌ను సీబీఐ, ఈడీలు కూడా అరెస్టు చేయొచ్చు : హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో : సందేశ్ ఖలీ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కీలక నేత షేక్ షాజహాన్‌ను సీబీఐ, ఈడీ అరెస్టు చేయొచ్చని కోల్‌కతా హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుపై మాత్రమే తాము స్టే విధించామని.. అరెస్టుపై ఎలాంటి స్టే లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. సందేశ్ ఖలీ గ్రామంలో మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జాలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటున్న షాజహాన్.. జనవరి 5 నుంచి పరారీలో ఉన్నాడు. వాస్తవానికి షాజహాన్‌ను రాష్ట్ర పోలీసులు అరెస్టు చేయొచ్చని గత సోమవారం రోజే హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే దానిపై అభ్యంతరం తెలుపుతూ ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. రాష్ట్ర పోలీసులపై తమకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. షేక్ షాజహాన్‌ సహా పరారీలో ఉన్న నిందితులతో పోలీసులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం, న్యాయమూర్తి జస్టిస్‌ హిరణ్‌మయ్‌ భట్టాచార్యతో కూడిన హైకోర్టు డివిజన్‌ ​​బెంచ్‌ బుధవారం తాజా ఆదేశాలు ఇచ్చింది. షాజహాన్‌ను సీబీఐ, ఈడీ అరెస్టు చేయొచ్చని తెలిపింది.


Next Story

Most Viewed