కాంగ్రెస్‌ను ఊహించని దెబ్బకొట్టిన ‘దీదీ’.. ఒక్కదెబ్బతో మళ్లీ మొదటికొచ్చిన విపక్షాల ఐక్యత!

by Disha Web Desk 19 |
కాంగ్రెస్‌ను ఊహించని దెబ్బకొట్టిన ‘దీదీ’.. ఒక్కదెబ్బతో మళ్లీ మొదటికొచ్చిన విపక్షాల ఐక్యత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజకీయ చతురలో తనదైన శైలిని ఫాలో అయ్యే హస్తం పార్టీకి పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఊహించని షాకిచ్చింది. బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్‌ను ఇవాళ టీఎంసీ తమలో చేర్చుకుంది. కర్ణాటక విజయంతో ఊపుమీదున్న కాంగ్రెస్ పార్టీకి సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో ఈ వ్యవహారం పుండు మీద కారణం చల్లిన చందంగా మారింది.

విపక్షాల ఐక్యతకు గండి?:

ఈ పరిణామం కాంగ్రెస్ అధిష్టానం ఎలా తీసుకోబోతోందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. రాబోయే ఎన్నికల్లో కలిసి కట్టుగా బీజేపీని ఎదుర్కోవాలని విపక్షాలు భావిస్తున్నాయి. బీజేపీని ఓడించే విషయంలో ఇటీవల మమతా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలను ఇబ్బంది పెట్టకుంటే కాంగ్రెస్‌తో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ కూటమితో మమతా బెనర్జీ కలిసి రాబోతున్నారనే చర్చ జరిగింది. ఇంతలోనే బెంగాల్ అసెంబ్లీ నుంచి తమ జెండాను పీకేసే పనికి మమతా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంగ్రెస్‌లో చర్చగా మారింది. దీంతో రాబోయే ఎన్నికల్లో మమతా బెనర్జీ కాంగ్రెస్ కూటమిలో ఉండటాన్ని హస్తం పార్టీ అధిష్టానం అంగీకరిస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

హీటెక్కిన బెంగాల్ రాజకీయం:

గెలిచిన మూడు నెలలకే కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిశ్వాస్ అధికార టీఎంసీ గూటికి చేరడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బిశ్వాస్ చేరికపై స్పందించిన టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ ‘బెంగాల్‌లో బీజేపీతో పోరాడే ఏకైక శక్తి టీఎంసీ మాత్రమేనని భావించిన బేరాన్ బిస్వాస్ మాతో చేరారు’ అని అన్నారు. ఇక రాష్ట్రంలో బీజేపీని ఎదుర్కోనే విషయంలో కాంగ్రెస్ ఏమీ మాట్లాడం లేదని అందువల్లే తాను కాంగ్రెస్‌లో చేరానని బేరాన్ వెల్లడించారు.

ఈ వ్యవహారంపై బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌదరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఎంసీ బెదిరింపులకు గురి చేసి తమ పార్టీ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని టీఎంసీ ముందు డబ్బు ఆఫర్ చేస్తుందని వినకుంటే బెదిరిస్తుందని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని బేరాన్‌కు అధిర్ సూచించారు. నీకు టికెట్ ఇచ్చి మార్కెట్లో విలువ పెరిగేలా చేసిందే కాంగ్రెస్ అన్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపు కోసం అహోరాత్రులు శ్రమించి పనిచేశారని వారందరికీ నమ్మక ద్రోహం చేశావని మండిపడ్డారు.


Next Story

Most Viewed