మోడీకి హ్యాట్రిక్ పక్కా.. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా అఖిలేష్ సెన్సేషనల్ కామెంట్స్

by Disha Web |
మోడీకి హ్యాట్రిక్ పక్కా.. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా అఖిలేష్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేంద్రంలోని బీజేపీ పార్టీ పెద్దలు వ్యూహాలు రచిస్తుంటే.. బీజేపీని ఓడిస్తామని బెబుతున్న ప్రతిపక్షాలు ఐక్యత చాటుకునేందుకు ఆగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిన్న మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ భేటీ జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించగా తాజాగా మరోసారి అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌ను మరింత ఇరకాటంలో నెట్టేలా వ్యాఖ్యలు చేశారు.

కొత్త ఫ్రంట్‌పై జోరుగా చర్చ జరుగుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ తన పాత్ర ఏంటో నిర్ణయించుకోవాలంటూ హాట్ కామెంట్స్ చేశారు అఖిలేష్ యాదవ్. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపాదిత ప్రతిపక్ష ఫ్రంట్ ఫార్ములా ఏమిటని అడిగిన ప్రశ్నకు అది ఇప్పుడే బహిర్గతం చేయబడదని అన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా తమ ఫ్రంట్ ఉంటుందంటూ బీజేపీ కాంగ్రెస్‌ను ఒకే తాను ముక్కలుగా అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ మాదిరిగానే బీజేపీ కూడా రాజకీయంగా ముగుస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన తప్పునే ప్రస్తుతం బీజేపీ చేస్తోందని ధ్వజమెత్తారు. కుల గణన చేపట్టాలని డిమాండ్‌ను గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ స్థానంలో పోటీకి దిగుతాం:

ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన స్థానాలైన అమెథీ, రాయ్ బరేలీకి లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయలేదని కానీ ఇకపై పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. అమెథీలో కాంగ్రెస్ గెలవడానికి తమ పార్టీ సాయం చేసింది. కానీ ఎస్పీ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగినప్పుడు కాంగ్రెస్ మాత్రం పట్టించుకోలేదని అందువల్ల ఇక్కడ పోటీ చేయాలని పార్టీ కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉందన్నారు. ఇప్పుడు ఈ స్థానాలపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.

ప్రశ్నార్థకంగా విపక్షాల ఐక్యత!

మమతా బెనర్జీ భేటీ తర్వాత అఖిలేష్ యాదవ్ చేసిన కామెంట్స్ నేషనల్ పాలిటిక్స్‌లో ఆసక్తిని రేపుతున్నాయి. ఓ వైపు బిహార్ సీఎం నితీష్ కుమార్ విపక్షాల కూటమికి కాంగ్రెస్ నేతృత్వం వహించాలని కోరుతుంటే మరో వైపు అఖిళేష్, మమతా బెనర్జీ కొత్త ఫ్రంట్ ఆలోచన చేయడం ఆసక్తిగా మారింది. త్వరలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ను కలుస్తామని వెల్లడించడంతో విపక్షాల కూటమి ఐక్యతపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు సైతం కాంగ్రెస్ లేని కూటమి దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజాగా అఖిలేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ పార్టీ అని తమది ప్రాంతీయ పార్టీ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను వదిలేసి ప్రాంతీయ పార్టీలే కీ రోల్ పోషించబోతున్నాయా? విపక్ష పార్టీల మధ్య చీలిక బీజేపీకి కలిసి రానుందా? అనేది చర్చగా మారుతోంది.Next Story