మరోసారి ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకేఎస్.. వారిలో తీవ్ర ఉత్కంఠ!

by Disha Web Desk 17 |
మరోసారి ఢిల్లీకి సిద్ధరామయ్య, డీకేఎస్.. వారిలో తీవ్ర ఉత్కంఠ!
X

న్యూఢిల్లీ: ఒక్కరోజులో కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ఉందన్న కీలక తరుణంలో.. కాబోయే సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ శుక్రవారం మరోసారి ఢిల్లీకి వెళ్లారు. కేబినేట్ కూర్పు పై అధిష్టానం పెద్దలతో డిస్కస్ చేసేందుకే వారు హస్తినకు వెళ్లారని తెలిసింది. ఈ సందర్భంగా వారిద్దరూ తొలుత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసానికి వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వారితో డీకే, సిద్ధూ దిగిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. వీరి ఢిల్లీ టూర్‌తో.. కర్ణాటకలో ఏర్పడబోయే కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది. తమ నాయకులు తమ కోసం ఎలాంటి కబురును మోసుకొస్తారో అనే కుతూహలం వారిలో పెరిగింది.

తొలుత ప్రమాణం చేసే 10 మంది మంత్రులు వీరే..

శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సిద్ధ రామయ్య బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా సిద్ధ రామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ తో పాటు పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిలో శివకుమార్ వర్గానికి చెందిన వారు ఎంత మందికి అవకాశం దక్కుతుంది..? వారికి ఏ శాఖలు కేటాయిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

కులం, ప్రాంతం, సీనియారిటీ ప్రాతిపదికన మంత్రివర్గ విధి విధానాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఈ క్రమంలో తొలి జాబితాలో కేబినెట్ మంత్రులుగా పరమేశ్వర, రామలింగారెడ్డి, హెచ్ కె పాటిల్, కేజె జార్జ్, యుటి కాధర్, సతీష్ జార్కిహోళి, ఎంబీ పాటిల్, లక్ష్మీ హెబ్బాల్కర్, హెచ్ సీ మహదేవప్ప, టీబీ జయచంద్రలు ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

మంత్రుల లిస్టులో బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ తో పోటీ చేసి ఓడిపోయిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలిచిన మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సావడి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలకు కూడా మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు హరిప్రసాద్, కేంద్ర మాజీ మంత్రి కే హెచ్ మునియప్ప కూడా మంత్రి పదవులు కోసం ఆశపడుతున్నారని తెలుస్తోంది. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ, జేడీఎస్ నాయకులను కూడా ఆహ్వానించారు.

సంక్షేమ పథకాల అమలు పైనే అందరి దృష్టి

సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం చేయగానే.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టనున్నారు. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సంబంధించిన "గృహ జ్యోతి" పథకం, ప్రతి కుటుంబానికి చెందిన మహిళకు రూ. 2,000 నెలవారీ సాయం అందజేసే "గృహ లక్ష్మి" పథకం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాల కుటుంబంలో ప్రతి సభ్యునికి 10 కిలోల చొప్పున బియ్యం ఇచ్చే "అన్న భాగ్య" పథకాల అమలుపై ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ యువకులకు ప్రతి నెల రూ. 3,000, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి వాటినీ అమల్లోకి తెస్తామని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.



Next Story

Most Viewed