కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ ప్రారంభించిన ఆప్

by Dishanational1 |
కేజ్రీవాల్‌ అరెస్టుకు నిరసనగా సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ ప్రారంభించిన ఆప్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనంగా పార్టీ ఆందోళనలను కొనసాగిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఆప్ చేపట్టిన పోరాటానికి ప్రజల నుంచి మద్దతు కోరుతూ సోషల్ మీడియా 'డీపీ క్యాంపెయిన్ 'గా మొదలుపెట్టింది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆప్ నేత, మంత్రి అతిశీ.. పార్టీ నేతలతో పాటు వాలంటీర్లందరూ ఎక్స్, ఫేస్‌బుక్ సహా ఇతర సోషల్ మీడియాల్లో తమ ఖాతాలకు డీపీగా కేజ్రీవాల్ ఉన్న ఫోటోను డిస్‌ప్లేగా మార్చాలని, ప్రజలు కూడా ఈ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు. 'మోదీ కా సబ్సే బడా డర్ కేజ్రీవాల్'(మోడీకి అతిపెద్ద భయం కేజ్రివాల్) క్యాప్షన్‌తో ఉన్న ఫోటోను ఉపయోగించాలని మంత్రి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ద్వారా ఈ క్యాంపెయిన్‌గా ప్రారంభించామని ఆమె వెల్లడించారు. దేశంలో మోడీని ఎదుర్కొనగల నేత కేజ్రీవాల్ ఒక్కరేనని, అందుకోసం లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆధారాలేమీ లేకపోయినా ఈడీ చేత అరెస్ట్ చేయించారన్నారు. రెండేళ్లుగా మద్యం కేసులో ఈడీ దర్యాప్తు చేసినప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరించలేదు. బీజేపీ, మోడీ కేజ్రీవాల్‌ను అడ్డుకునేందుకే నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. దీనికి వ్యతిరేకంగానే ఆప్ యుద్ధం చేస్తోందన్నారు.


Next Story

Most Viewed