రైతుల నిరసనల హోరు.. 54 రైళ్లు రద్దు

by Dishanational4 |
రైతుల నిరసనల హోరు.. 54 రైళ్లు రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో : 54 రైళ్లు రద్దయ్యాయి. రైతుల నిరసనలు హోరెత్తడంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా ? పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న శంభు రైల్వే స్టేషన్‌లో !! ఇక్కడ వరుసగా నాలుగో రోజు (శనివారం) కూడా అన్నదాతలు రైలు పట్టాలపైకి వచ్చి నిరసనకు దిగారు. దీంతో అంబాలా-అమృత్‌సర్ మార్గంలో మొత్తం 54 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఇటీవల ‘చలో ఢిల్లీ’ మార్చ్ సందర్భంగా హర్యానా పోలీసులు ముగ్గురు పంజాబ్ రైతులను అరెస్టు చేశారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ అన్నదాతలు గత మూడు రోజులుగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రైతుల నిరసనల వల్ల 380 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) ఆధ్వర్యంలో పాటియాలా జిల్లా శంభులో రైతులు నిరసనలు చేపడుతున్నారు. పంజాబ్-హర్యానా సరిహద్దు సమీపంలోని శంభులో ఉన్న అంబాలా-లూథియానా-అమృత్‌సర్ రైలు మార్గంలో బుధవారం నుంచి ఈ నిరసనలు జరుగుతున్నాయి.ముగ్గురు రైతులను హర్యానా పోలీసులు విడుదల చేసే వరకు నిరసన కొనసాగిస్తామని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ స్పష్టం చేశారు.



Next Story