హాస్టల్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్.. ఏమయ్యారు ?

by Dishanational4 |
హాస్టల్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్.. ఏమయ్యారు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : అనుమతి లేకుండా నిర్వహిస్తున్న బాలికల హాస్టల్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమవడం కలకలం రేపింది. వారంతా ఏమయ్యారు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌‌కు 20 కిలోమీటర్ల దూరంలోని పర్వాలియా ఏరియాలో ఉన్న ఆంచల్ గర్ల్స్ హాస్టల్‌లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. దర్యాప్తు చేసి బాలికల ఆచూకీని గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనూంగో ఈ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ రిజిస్టర్‌ను చెక్ చేయగా.. అందులో ఉంటున్న 68 మంది బాలికలకుగానూ 26 మంది గల్లంతైనట్లు వెలుగులోకి వచ్చింది. వారంతా ఎటు వెళ్లారని హాస్టల్ నిర్వాహకులను ప్రశ్నించగా.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయారని చెప్పారు. పేరెంట్స్ వచ్చి ఆ బాలికలను తీసుకెళ్లినట్లుగా ఆధారాలు చూపించండని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు ప్రశ్నించగా.. హాస్టల్ నిర్వాహకులు నీళ్లు నమిలారు. దీనిపై వారం రోజుల్లోగా తమకు విచారణ నివేదికను సమర్పించాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రియాంక్ కనూంగో లేఖ రాశారు.

అర్ధరాత్రి టైం తర్వాత..

ఇక స్థానిక పోలీసులు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద హాస్టల్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధ్యప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్ సహా పలు రాష్ట్రాల నుంచి ఇక్కడి హాస్టల్‌కు బాలికలు ఎలా వచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘ఈ హాస్టల్‌లో ఉండే బాలికల్లో ఎక్కువ మంది హిందూ, ముస్లిం, ఎస్టీ, ఎస్సీ వర్గాల వారే. కానీ వారంతా హాస్టల్‌లో క్రైస్తవ మత పద్ధతులను అనుసరించేవారని మాకు తెలిసింది’’ అని మధ్యప్రదేశ్ బాలల కమిషన్ సభ్యులు పేర్కొన్నారు. ‘‘గత నాలుగైదు ఏళ్లుగా ఈ హాస్టల్ నడుస్తోంది. హాస్టల్‌లోని బాలికలను తరుచుగా అర్ధరాత్రి టైం తర్వాత బైక్‌పై గుర్తుతెలియని ప్రదేశాలకు తీసుకెళ్లేవారు’’ అని ఓ స్థానికుడు మీడియాకు చెప్పాడు.

Next Story

Most Viewed