నిమ్జ్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా

by  |
నిమ్జ్ ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంగారెడ్డి జిల్లాలో తలపెట్టిన నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. ఆ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు రావడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న కొవిడ్ నిబంధనలకు విరుద్ధమైనదిగా ఉంటుందని నొక్కిచెప్పారు. మరో రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి సూచించింది. కొవిడ్ నిబంధనల ఉల్లంఘనకు తావులేని విధంగా నిర్వహించడం సహేతుకంగా ఉంటుందని, జూలై 10వ తేదీన నిర్వహించే కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు-మౌలిక సదుపాయాల సంస్థ సంగారెడ్డి జిల్లాలో నిర్మిస్తున్న నిమ్జ్ కోసం 12,635 ఎకరాల స్థలం అవసరమని భావించింది. దీన్ని జహీరాబాద్ నిమ్జ్ అని పిలుస్తున్నప్పటికీ సంగారెడ్డి జిల్లాలోని న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల పరిధిలోని 17గ్రామాల్లోని భూములకు కూడా ముప్పు ఏర్పడనుంది. ఈ ప్రాజెక్టును ఈ గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుండడంతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సి వస్తోంది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి షెడ్యూలు ప్రకారం జూలై 10 ఉదయం 11 గంటల నుంచి ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ ఆశ్రమం క్రాస్ రోడ్డు దగ్గర టీఎస్ఐఐసీ స్థలంలో జరగాల్సి ఉంది. కానీ న్యాల్‌కల్ మండలానికి చెందిన ఐదుగురు ఈ ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు తాత్కాలిక వాయిదా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజాభిప్రాయ సేకరణ ప్రహసనంగా మిగలకూడదు

ప్రజాభిప్రాయ సేకరణ అనే ప్రక్రియ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నదని, మొక్కుబడిగా ఒక ఫార్మాలిటీగా ముగించడానికి కాదు అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇచ్చిన ఆదేశం ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు నిర్వహించుకోవచ్చునని, ఇప్పుడు కరోనా ఉన్న పరిస్థితుల్లో ప్రజలు గుమికూడడం వారి ప్రాణాలకు ప్రమాదకరమని, వైరస్ సోకడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారమే సుమారు వెయ్యి మంది హాజరు కానున్నట్లు ఉందని, ఇంతమంది గుమికూడడం కేంద్ర, రాష్ట్ర కొవిడ్ మార్గదర్శకాలకు విరుద్ధమైనదన్నారు. సంగారెడ్డి జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఇళ్ళ నుంచి బైటకు రావడానికి జంకుతున్నారని, ఇలాంటప్పుడు కొద్దిమందితో కార్యక్రమాన్ని ముగించడం అర్ధవంతంగా ఉండదన్నారు. ఇక్కడ జరిగే నిర్ణయాన్ని బట్టి ప్రజల భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుందని, ప్రజలు వారి అభిప్రాయాలను పూర్తిస్థాయిలో చెప్పుకోడానికి ఈ కార్యక్రమం దోహదపడదని అన్నారు. ఎలాగూ కేంద్రం ఇచ్చిన గడువు ఇంకా ఎనిమిది నెలలు ఉన్నందున ఇప్పుడు హడావిడిగా నిర్వహించాల్సిన అవసరం లేదని, వాయిదా వేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అన్ని ఏర్పాట్లూ చేశాం: ప్రభుత్వం

ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ప్రజలకు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, మూడు వేల బాటిళ్ళ శానిటైజర్లు, మూడు వేల మాస్కులు, 40 ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు, రెండు వేల గ్లౌజులు, కాలితో నొక్కే శానిటైజర్ స్టాండ్లను కూడా పెట్టామని ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ వివరించారు. సోషల్ డిస్టెన్స్ పాటించే విధంగా కుర్చీలను కూడా అమర్చామని, కొవిడ్ నిబంధనలను పాటించే ఏర్పాట్లు చేశామని తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడానికి, పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటున్నామని తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని, ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండున్నర వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిస్తుందన్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం జనం గుమికూడదని అనుకున్నా ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి అలాంటి నిషేధమేదీ లేదని వ్యాఖ్యానించారు.

అనుమతి ఇవ్వలేం:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల్లో పెళ్ళిళ్ళకు, అంత్యక్రియలకు కూడా ఎంత సంఖ్యలో హాజరుకావాలో స్పష్టత ఉన్నదని, జనం గుమికూడే కార్యకలాపాలన్నింటిపై నిషేధం ఉందని అడ్వొకేట్ జనరల్‌కు హైకోర్టు గుర్తుచేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సుమారు వెయ్యి మంది హాజరుకావడానికి మార్గదర్శకాల్లో ఎక్కడ అనుమతి ఉందో వివరించాలని నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమమైనా మార్గదర్శకాలకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. పైగా నిబంధనలను పటిష్టంగా, పకడ్బందీగా అమలుచేయాల్సిందిగా జిల్లా ఎస్పీలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు. వైరస్ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా మార్గదర్శకాల ఉల్లంఘనే కాబట్టి అనుమతి ఇవ్వలేమని, మరో తేదీకి వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మరో తేదీలో నిర్వహించినా కచ్చితంగా మార్గదర్శకాలకు, చట్టానికి లోబడి ఉండాలని వివరించింది.

Next Story

Most Viewed