జూన్‌లో 'బ్యాడ్ బ్యాంక్' కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం

by  |
జూన్‌లో బ్యాడ్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో నిరర్ధక ఆస్తుల(ఎన్‌పీఏ) సమస్యలను అధిగమించేందుకు కేంద్రం బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ‘బ్యాడ్ బ్యాంక్’ కార్యకలాపాలు జూన్ నెలలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.’ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సహకారంతో ఈ కొత్త సంస్థ రూపొందుతుందని, ప్రస్తుతం ఈ బ్యాంకుకు సంబంధించి ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్టు’ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈఓ సునీల్ మెహతా చెప్పారు.

రికవరీల విషయంలో బ్యాడ్ బ్యాంక్ సమర్థవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నామని ఆయన వివరించారు. బ్యాంకింగ్ రంగంలోని మొండి బకాయిల విషయంలో పరిష్కారాల కోసం ‘బ్యాడ్ బ్యాంక్’ను 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ బ్యాంకు నేషనల్ అసెట్ రీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(ఎన్ఏఆర్‌సీఎల్) పేరుతో వ్యవహరించనున్నారు. ఎన్‌పీఏల సమస్యలను అధిగమించేందుకు 2020లోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ విధానంలో దీన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.



Next Story