వైసీపీకి ఇది ట్రైలరే.. సినిమా ముందుచూపిస్తాం : నారా లోకేష్

by  |
Lokesh
X

దిశ, ఏపీ బ్యూరో: ‘2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తా. జగన్‌లా నేనేమీ చిన్నాన్న జోలికి వెళ్లలేదు. జగన్ అంత సమర్థుడే అయితే వాళ్ల చిన్నాన్న కేసు తేల్చాలి. వైసీపీకి ట్రైలర్ మాత్రమే చూపించాం. సినిమా ముందుందని’ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. చంద్రబాబు చేపట్టిన ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ దీక్షలో కార్యకర్తలను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో గంజాయి పరిశ్రమ బాగా నడుస్తోందని విమర్శించారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారని టీడీపీ ప్రశ్నిస్తే టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపించే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం దురదృష్టకరమన్నారు. దమ్ముంటే పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటికి రావాలని లోకేశ్ సవాల్ విసిరారు. కొన్ని పిల్లులు తమను తాము పులులు అనుకుంటున్నాయంటూ సెటైర్లు వేశారు. పసుపు జెండా చూస్తే హడలిపోతుంటారని ధ్వజమెత్తారు. ఒక చెంప మీద కొడితే రెండు చెంపలు వాయగొడతామని లోకేశ్ హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంలో పగిలింది అద్దాలు మాత్రమేనని టీడీపీ కార్యకర్తల హృదయాలను గాయపర్చలేరంటూ చెప్పుకొచ్చారు. రెండున్నరేళ్లు గడచిపోయాయని.. మరో రెండున్నరేళ్లు ఆగండి.. చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారు అంటూ లోకేశ్ దీమా వ్యక్తం చేశారు.

ఏపీ డ్రగ్స్ హబ్ అని నిఘా వ్యవస్థలే చెప్తున్నాయి

డీజీపీ గౌతం సవాంగ్‌పై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి డ్రగ్స్, గంజాయితో సంబంధంలేదని సీఎం, డీజీపీ చెబుతున్నారు. కానీ దేశవ్యాప్తంగా పోలీసు విభాగాలు, నిఘా వ్యవస్థలు మాత్రం ఏపీనే డ్రగ్స్ హబ్ అని కోడై కూస్తున్నాయని దీనికి సమాధానం ఏం చెప్తారని లోకేశ్ ప్రశ్నించారు. మరి వాళ్లందరికీ కూడా నోటీసులు ఇస్తారా? విచారణకు పిలుస్తారా? ఇప్పుడేం చేస్తారు? అంటూ డీజీపీని లోకేశ్ ప్రశ్నించారు. దేశంలో ఏ మూల డ్రగ్స్ పట్టుకున్నా ఏపీతోనే లింకు అని తెలిపారు. ఇది తాను చెప్పడం కాదని, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు వెల్లడిస్తున్న కఠోర వాస్తవం అని స్పష్టం చేశారు. అందుకు సంబంధించి నల్గొండ ఎస్పీ రంగనాథ్ వీడియోను ట్విట్టర్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.


Next Story

Most Viewed