జేఈఈ ఫలితాల్లో నందిగామ నిఖిల్ కు ప్రథమ ర్యాంక్

by  |
జేఈఈ ఫలితాల్లో నందిగామ నిఖిల్ కు ప్రథమ ర్యాంక్
X

దిశ,పాలేరు: ఈ నెల 3న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను ఐఐటీ ఖరగపూర్ ప్రకటించింది. ఈ ఫలితాల్లో జనరల్ (ఈడబ్ల్యూఎస్) విభాగంలో రామస్వామి సంతోష్ రెడ్డి, ఎస్సీ విభాగంలో నందిగామ నిఖిల్, ఎస్టీ విభాగంలో బిజిలి ప్రచోతన్ వర్మ తొలి ర్యాంకులు సాధించారు. కాగా నందిగామ నిఖిల్ ది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాధవరం గ్రామం. ఇటీవల ఆలిండియా స్థాయిలో నిర్వహించిన జేఈఈ పరీక్షల్లో కూడా 99.997 పర్సెంటేజ్తో ఎస్సీ కేటగిరిలో జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని సాధించాడు. అత్యుత్తమ ప్రతిభతో జాతీయస్థాయిలో ఈ ఘనతను సాధించారు. దీనితో నిఖిల్ నివాసంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది. నిఖిల్ ని పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామస్తులు అభినందిస్తున్నారు.

ఈ సందర్భంగా నిఖిల్ తల్లిదండ్రులు ఆనంద్, రాణి దిశ తో మాట్లాడుతూ చిన్నతనం నుండి చదువు పట్ల ఆసక్తి కనపరచేవాడని శుక్రవారం ప్రకటించిన ఫలితాల్లో జాతీయ స్థాయి మొదటి ర్యాంక్ రావటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. వృత్తి రీత్యా తల్లిదండ్రులు ఆనంద్, రాణి ఇద్దరు ఉపాధ్యాయులు కావటం నిఖిల్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాల్యం నుండే చదువుల్లో ముందుండేలా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. లక్ష్య సాధన కోసం ప్రణాళికా బద్ధంగా చదివితే తప్పకుండా విజయం వరిస్తుందని అన్నారు. నాకు సహకరించిన ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎనలేనిదన్నారు. మరెన్నో విజయాలు సాధించడానికి మీ అందరి దీవెనలు కావాలన్నారు. కాగా, తండ్రి ఆనంద్ చెర్వుమాధారంలో, తల్లి రాణి గోల్ తండాలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

ఇక విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు, 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ప్రస్తుతం విద్యార్థుల కోసం మొత్తం 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయని శనివారం నుంచి విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 27న సీట్ల కేటాయింపు జరగనుంది. ర్యాంకులు సాధించిన విద్యార్థులు josaa.nic.in.లోతమ పేర్లు నమోదు చేసుకోవాలి. కాగా, 1.41 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్ష రాయగా.. 41,862 మంది అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది అమ్మాయిలు ఉన్నారు.


Next Story

Most Viewed