ఆ కాల్వలకు వీరన్న, భద్రకాళి పేర్లు

by  |
ఆ కాల్వలకు వీరన్న, భద్రకాళి పేర్లు
X

దిశ, వరంగల్: మహబూబాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్న ఎస్సారెస్పీ కాలువలకు కురవి వీరభద్ర స్వామి, భద్రకాళి పేర్లు పెడుతున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ లో సోమవారం రాత్రి ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సారెస్పీ స్టేజ్-1 వెన్నెవరం కాలువకు శ్రీవీరభద్ర స్వామి పేరు, స్టేజ్-2 కాలువకు భద్రకాళి అమ్మవారి పేరు పెడుతున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ ప్రయత్నం ద్వారా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్ జిల్లాలో ఎండాకాలంలో సైతం చెరువుల్లో నీరు ఉందన్నారు. రైతును రాజు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్నారు. రైతుకు ఎకరం, అరఎకరం ఉన్నా రైతు బంధు వస్తుందన్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద కంటే మహబూబాబాద్, డోర్నకల్ నియోజక వర్గాల్లో ఎక్కువ పంటలు పండాలన్నారు. ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్- 2 కాలువల ద్వారా డోర్నకల్ చివరి ఆయకట్టు వరకు నీరు వచ్చే విధంగా అన్ని చెరువులు నింపుతామన్నారు. చెరువుల్లో చేపలు పోసుకుని బతికే మత్స్య కార్మికులు కూడా సంతోషంగా ఉండేవిధంగా.. కులవృత్తులు వారి వృత్తులు చేసుకునే విధంగా అన్ని రకాల సాయం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులున్నా రూ. 25వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తున్నట్లు వివరించారు.



Next Story

Most Viewed