ఈ చంద్రవంక అబ్బురం… కానీ,…?

by  |
ఈ చంద్రవంక అబ్బురం… కానీ,…?
X

దిశ, సిరిసిల్ల: దశాబ్దాల చరిత్ర కలిగిన చంద్రవాగుపై నిర్మించిన ప్రాజెక్ట్ పునరుజ్జీవనానికి నోచుకోక చరిత్రలో కూరుకుపోతుంది. అబ్బురపరిచే అప్పటి ప్రాజెక్టు మత్తడి కాలువలు నేడు నిర్లక్ష్యానికి గురవుతూ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. సుమారు 1,500 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు పనులు ప్రారంభించిన చంద్రవంక ప్రాజెక్ట్ మరమ్మతులపై అధికారులకు, పాలకులకు పట్టింపు లేకుండా పోయింది. సిరిసిల్ల జిల్లా సరిహద్దుల్లోని జిల్లెల నక్కవాగు ప్రాజెక్టుకు జీవాన్ని ఇచ్చిన చంద్రవాగు తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామ చెరువులను నింపుతూ మానేరు వాగులో కలుస్తుంది. చంద్రవాగు వరద ఉద్ధృతికి అంకుసాపూర్ సమీప గ్రామ పంట భూములకు నష్టం జరగడంతో 1969లో చంద్రవంక ప్రాజెక్టును నిర్మించారు. 2016లో తెలంగాణ ప్రభుత్వం 80 లక్షల వ్యయంతో పున:నిర్మించగా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఒక్క వరదకే శిథిలమైపోయింది. తంగళ్లపల్లి మండలంలోని 1,500 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్ట్ పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారిపోయింది. మరమ్మతులు చేయిస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు వాపోతున్నారు. మానేరు, అనంతసాగర్ చుట్టూ గోదారమ్మ సుడులు తిరుగుతూ సుదూర ప్రాంతాలకు తరలి పోతుంటే తలాపునే ఉన్న తమ భూములను మాత్రం తడపడం లేదని ఆ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రవంక ప్రాజెక్టును బాగు చేయించేందుకు చొరవ చూపించాలని రైతులు కోరుతున్నారు.


Next Story