మానసికంగా దృఢంగా ఉండాలి : నాగ్

by  |
మానసికంగా దృఢంగా ఉండాలి : నాగ్
X

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొద్దిరోజుల కిందట రోజుకు 200 కేసులు నమోదైతేనే.. ప్రజలంతా ఆందోళన చెందారు. ఇప్పుడు ఏకంగా వెయ్యికి దరిదాపుల్లో కేసులు నమోదు అవుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటమే మన దగ్గరున్న ప్రధాన ఆయుధమని టాలీవుడ్‌ కింగ్ నాగార్జున గురువారం ట్వీట్‌ చేశారు. మోడల్‌, న్యూట్రిషనిస్ట్‌‌, తన ఫ్యామిలీ ఫ్రెండ్ శిల్పారెడ్డి.. ఇటీవలే కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. శిల్పారెడ్డి సమంతకు కూడా మంచి ఫ్రెండ్. అయితే ఆమెతో పాటు తన భర్తకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా ప్రస్తుతం వారిద్దరూ కరోనాను జయించారని నాగ్ వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవడానికి వారు పాటించిన ఆరోగ్య సూత్రాలు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉన్నాయని, వారి అనుభవాలను ఓసారి వినాలని నాగ్ తన ట్విట్టర్ ద్వారా సూచిస్తున్నాడు.

శిల్పారెడ్డి, తన భర్త కరోనా పాజిటివ్ రావడంతో దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి డైట్ పాటించారో, ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారో వివరిస్తూ ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేశారు. కాగా నాగార్జున అదే వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. ‘నాకు, నా భర్తకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ కాస్త అలసటగా ఉండటంతో పరీక్షలు చేయించుకున్నాం. అందులో పాజిటివ్‌గా తేలింది. తగిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, డైట్‌ పాటిస్తూ ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటే.. కరోనాను జయించవచ్చు. ఇది ఎవరికైనా రావచ్చు. అందరికీ హెల్ప్ అవుతుందనే ఈ వీడియో చేస్తున్నాను. కరోనా వచ్చిన సమయంలో అస్సలు భయపడకూడదు. భయపడటం వల్ల.. అది మన ఇమ్యూన్ సిస్టమ్‌ను దెబ్బతీస్తుంది. ప్రతీరోజు 1000 ఎమ్‌జీ సీ విటమిన్ తీసుకోవాలి. 40-50 ఎమ్‌జీ జింక్ తీసుకోవాలి.. ఓ ప్రో బయోటిక్ క్యాప్సుల్ తీసుకోవాలి. వార్మ్ వాటర్ మాత్రమే తాగాలి. పుదీనా, తులసి, పసుపు కలిపిన నీళ్లు తాగడం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు తప్పక వ్యాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం తప్పనిసరి. నవ్వుతూ ఉండాలి. నేనైతే డ్యాన్స్ చేశాను, పాటలు పాడాను. మనం ప్రతి రోజు ఎలా ఉంటామో అలానే ఉండాలి’ అని శిల్పారెడ్డి ఆ వీడియోలో తెలిపారు.

Next Story