నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అతనే..!

by  |
నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి అతనే..!
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగర్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపిక రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నమొన్నటి వరకు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరనే దానిపై రకరకాల పేర్లు వినిపించాయి. కానీ తాజాగా సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి అభ్యర్థితత్వం దాదాపు ఖరారయ్యింది. అందుకు సంబంధించిన సంకేతాలను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఇచ్చేశారు. బుధవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఆయన వెంట ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌తో పాటు మరో వ్యక్తి వచ్చారు.

వాస్తవానికి సీఎం కేసీఆర్ ఎవరికి పదవి కట్టబెట్టాలని నిర్ణయించుకున్నా.. తన వెంట తీసుకెళ్లడం కేసీఆర్ ఆనవాయితీ. గతంలోనూ ఇలా తన వెంట తీసుకెళ్లిన వారికి పదవులు కట్టబెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా హాలియా బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సీఎం కేసీఆర్ తన వెంట తేరా చిన్నపరెడ్డిని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన అనంతరం హిల్ కాలనీలోని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో సీఎం కేసీఆర్.. తేరా చిన్నపరెడ్డితో కలిసి భోజనం చేశారు. వాస్తవానికి హాలియా బహిరంగ సభలోనే ఉపఎన్నిక అభ్యర్థి పేరును ప్రకటించాల్సి ఉంది. కానీ టికెట్ కోసం టీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షాల వ్యుహాలకు చిక్కకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ అభ్యర్థి పేరును ప్రకటించడంలో తాత్సారం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చక్రం తిప్పిన తేరా..

టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో పోటీ చేసేందుకు అశావాహుల జాబితా చాంతాడంతా పెరిగిపోయింది. ఇందులో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య తనయుడు నోముల భగత్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అయితే తేరా చిన్నపరెడ్డికి.. ఎంసీ కోటిరెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. దీంతో చిన్నపరెడ్డి టికెట్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్సీ తండ్రితో మధ్యవర్తిత్వం నడిపారు. సదరు ఎమ్మెల్సీ తండ్రి సైతం తేరా అభ్యర్థితత్వంపై కేసీఆర్‌కు సానుకూలంగా వివరించారు. దాని ఫలితంగానే సీఎం కేసీఆర్ సాగర్ ఉపఎన్నిక అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి అభ్యర్థితత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

తేరాతో సుదీర్ఘంగా మంతనాలు..

సాగర్ ఉపఎన్నికలో తేరా చిన్నపరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తే.. ఏలాంటి పరిణామాలు ఎదురవుతాయి..? బలాబలాలు ఏంటి..? పార్టీ ఒడిదుడుకులకు లోనవుతుందా..? ఎన్నికల్లో ఏలాంటి వ్యుహాలు అనుసరించాలి? అనే విషయాలపై సీఎం కేసీఆర్ ఇప్పటికే సుదీర్ఘంగా చర్చించారు. హెలీకాప్టర్‌లో హైదరాబాద్ నుంచి బయలుదేరింది మొదలు.. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్సీ తండ్రి, ఎంపీ సంతోష్ కుమార్‌తో నెల్లికల్లు చేరుకునే వరకు సమీక్షించారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి నివాసంలో భోజనం అనంతరం కొద్దిసేపు ముచ్చటించారు. గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డితో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ కోటిరెడ్డిని లాక్కుంటే.. ఏలాంటి వ్యుహాం అనుసరించాలనే విషయంపైనా ప్రస్తావనకు వచ్చిందని సమాచారం. ఏదిఏమైనా సాగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నపరెడ్డి బరిలో నిలవడం దాదాపు ఖాయమయ్యింది.

సాగర్‌లో ‘సంకినేని’ స్కెచ్‌.. సీన్‌లోకి ‘చిన్నపరెడ్డి’?



Next Story