నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు

by  |
నాగార్జున సాగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో జానారెడ్డి పోటీ చేస్తున్నారని ఏఐసీసీ ప్రకటించింది. పీసీసీ చీఫ్ మార్పు సమయంలో దాదాపు నిర్ణయం జరిగిపోయిందని జనవరిలో వార్తలు వచ్చిన సమయంలోనే జానారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం తెలిపింది. సాగర్ ఉప ఎన్నిక షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన రోజునే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి (ప్రధాన కార్యదర్శి) ముకుల్ వాస్నిక్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో జానారెడ్డి సాగర్ అభ్యర్థి అని ప్రకటించారు. సోనియాగాంధీ ఆమోదం మేరకు ఖరారు చేసినట్లు తెలిపారు.

జానారెడ్డి పోటీ చేస్తారా? లేక ఆయన తన కొడుకుని నిలబెడతారా? అని ప్రచారం జరుగుతున్న సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రకటన చేయడం గమనార్హం. సాగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య డిసెంబరులో చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. నెలన్నర కిందటే జానారెడ్డికి టికెట్ ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. అప్పటి నుంచే ఆయన ప్రచారం మొదలుపెట్టారు. పలు గ్రామాల్లోని ప్రజలతో సమావేశమయ్యారు. నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఒక్కటై జానారెడ్డిని గెలిపించుకుంటామని బహిరంగంగానే ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య ఎన్ని గ్రూపులు ఉన్నా జానారెడ్డి విషయంలో మాత్రం ఒక్కటి కావడం ఆ పార్టీ నేతలనే విస్మయానికి గురిచేసింది. మళ్లీ మిగతా పార్టీకంటే ముందే అభ్యర్థిని ఖరారు చేయడం గమనార్హం.

Next Story

Most Viewed