ఆస్కార్ అవార్డు రేసులో ‘మై ఆక్టోపస్ టీచర్’

by  |
ఆస్కార్ అవార్డు రేసులో ‘మై ఆక్టోపస్ టీచర్’
X

దిశ, ఫీచర్స్ : సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఆస్కార్. జీవితంలో ఒక్కసారైనా బంగారు లేడీని అందుకోవాలని సినీ కళాకారులు ఆశపడుతుంటారు. వచ్చే నెలలో జరగనున్న 93వ అకాడమీ అవార్డుల నామినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ ఏడాది ఆస్కార్‌ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో ఐదు నామినీలు(కలెక్టివ్, క్రిప్ క్యాంప్, ది మోల్ ఏజెంట్, మై ఆక్టోపస్ టీచర్, టైమ్) పోటీపడుతున్నాయి. వీటిలో మూడు డాక్యుమెంటరీలు ఇండియన్ ఓటీటీ యూజర్లకు అందుబాటులో ఉండగా, అందులో ఓ సినిమాకు ఇండియన్ కనెక్షన్ ఉంది. ఎన్విరాన్‌మెంటల్ జర్నలిస్ట్, నేచర్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ స్వాతి త్యాగరాజన్.. ‘మై ఆక్టోపస్ టీచర్’‌కు అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. క్రెయిగ్ ఫాస్టర్‌ అనే డైవర్ సమద్ర ప్రయాణపు అనుభవాలతో పాటు దక్షిణాఫ్రికాలోని కెల్ప్ అడవిలో ఓ ఫిమేల్ ఆక్టోపస్‌కు, అతనికి మధ్య ఏర్పడే అసాధారణ సంబంధాన్ని ఈ చిత్రంలో చూపించారు. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఈ డాక్యుమెంటరీ విశేషాలు మీకోసం..

ప్రకృతితో మనిషికి అవినాభావ సంబంధం ఉంటుంది. అదేవిధంగా తోటి జీవులతోనూ మనుషులు విడదీయరాని బంధాల్ని ఏర్పరచుకుంటారు. ఈ క్రమంలో అడవికి రాజైన మృగరాజుతో, అత్యంత బలాఢ్యమైన ఏనుగుతో, విషాన్ని నింపుకున్న పాములతోనూ ఎంతోమంది స్నేహానుబంధాన్ని కొనసాగిస్తున్నారు. శునకాలు, పిల్లులనైతే ఇంట్లోని సభ్యుల్లా చూసుకుంటాం. అందుకే ఈ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మనకు బాగా కనెక్ట్ అవుతాయి. హాలీవుడ్‌లో వచ్చిన ‘లైఫ్ ఆఫ్ పై’ ‘అవతార్’ ‘కింగ్ కాంగ్’ చిత్రాలు ఉత్తమ నిదర్శనం కాగా, అందులోని కొన్ని దృశ్యాలు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. ఇక ఆస్కార్ (2021)కు ఎంపికైన ‘మై ఆక్టోపస్ టీచర్’ కూడా ప్రకృతి, జంతువులతో మనుషులకున్న బంధాల నేపథ్యంలో వచ్చిన చిత్రమే. అంతర్లీనంగా మనసు తడి చేసే ఓ ప్రేమకథతో సాగే ఈ చిత్రం చూస్తే కళ్లు చెమ్మగిల్లడం సాధారణమే.

డైవర్, వీడియోగ్రాఫర్ అయిన ఫాస్టర్.. ప్రతి రోజు దక్షిణాఫ్రికా తీరంలోని గ్రేట్ ఆఫ్రికన్ సీ ఫారెస్ట్‌లో డైవింగ్ చేస్తుంటాడు. ఈ క్రమంలోనే రంగురంగుల చర్మంతో, ఇతర జంతువుల నుంచి ఎంతో తెలివిగా తప్పించుకునే ఆక్టోపస్‌‌ను చూసి ఆకర్షితుడవుతాడు. అయితే తన కెమెరా లెన్స్‌లు చూసి భయపడ్డ ఆక్టోపస్ అతనికి కనిపించకుండా పోతుంది. కానీ ఎలాగైనా దాన్ని కనుగొనాలనుకున్న ఫాస్టర్.. ఆక్టోపస్ ట్రాక్‌లను ఎలా చదవాలో తెలుసుకుని మొత్తానికి దాని వద్దకు చేరుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత ఫాస్టర్‌ను చూసిన ఆక్టోపస్.. తన దగ్గరకు వచ్చి హగ్ చేసుకుంటుంది. సినిమాలో ఇదో భావోద్వేగపూరిత, స్పెల్ బౌండింగ్ సీన్‌గా నిలుస్తుంది. అప్పటి నుంచి వారిద్దరి మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. ఇక సొరచేపల నుంచి పలుసార్లు ముప్పును ఎదుర్కొన్న సందర్భాలు, ఆక్టోపస్‌కు పిల్లలు పుట్టే దృశ్యాలు ప్రేక్షకులను ఉద్వేగానికి గురిచేస్తాయి. ఈ పరిణామాలు ఫాస్టర్‌ను కూడా కలవరపెడతాయి. ఈ క్రమంలోనే విద్యార్థిగా మారిన ఫాస్టర్.. ఆక్టోపస్ జీవనవిధానం గురించిన ప్రతీ విషయాన్ని తెలుసుకుంటాడు.

కొన్నాళ్లకు ఆక్టోపస్ మేట్ అయినట్లు తెలుసుకున్న ఫాస్టర్.. అది తనకు దూరం కాబోతుందని బాధపడుతుంటాడు. ఎందుకంటే, ఆక్టోపస్‌లు సెమెల్పరస్ జాతికి చెందిన జంతువులు. అంటే పునరుత్పత్తి తర్వాత ఫిమేల్స్ చనిపోతాయి. కాగా ఆక్టోపస్ చనిపోయిన తర్వాత ఫాస్టర్ ఒంటరిగా ఫీలవుతూ దాని డెన్ వద్దకు మళ్లీ మళ్లీ వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలో వీరి స్నేహం విషాదాంతంగా ముగిసిందని అనుకుంటున్న తరుణంలో ఫాస్టర్ కొడుకు మరో చిన్న ఆక్టోపస్‌ను కనుగొంటాడు. దాంతో ఫాస్టర్ ముఖంలో మళ్లీ చిరునవ్వు కనిపిస్తుంది. ఆ చిన్న ఆక్టోపస్‌ను చూసిన ఫాస్టర్ ‘ఆమె యవ్వనంలో ఇలానే ఉండి ఉంటుంది’ అంటూ సంతోషం వ్యక్తం చేస్తుండటంతో సినిమా ముగుస్తుంది.

గ్రేట్ ఆఫ్రికన్ ఫారెస్ట్‌ను కాపాడాలనే ఉద్దేశం..

చాలా మంది ఆక్టోపస్ గ్రహాంతరవాసిలాంటి జీవి అని చెప్తారు. కానీ విచిత్రమేమిటంటే.. వాటితో సన్నిహితంగా ఉన్నప్పుడు, మనతో పాటు అవి కూడా ఎన్నో అంశాల్లో మనల్ని పోలి ఉంటాయి. వైల్డ్ లైఫ్‌తో మనుషులను కనెక్ట్ చేసే చిత్రం ఇది. అంతేకాదు గ్రేట్ ఆఫ్రికన్ ఫారెస్ట్‌ను కాపాడాలనే ఉద్దేశంతో చేశాను. మానవులు, నేచర్ వరల్డ్ ఒకే చోట ఉండటంలో సానుకూలతను చూపించాను. మనకు, అడవికి మధ్య ఉన్న సంబంధంపై ప్రజల అవగాహన, పర్సెప్షన్ విస్తరించడానికి ఇదో అవకాశంగా భావించాను. ప్రపంచవ్యాప్త ప్రేక్షకుల నుంచి అభినందనలు వస్తున్నాయి. ఇండియా నుంచి కూడా ఎంతోమంది ఫోన్లు, మెసేజ్‌లు చేశారు – పిప్పా ఎర్లిచ్, డైరెక్టర్

‘మై ఆక్టోపస్ టీచర్’ చిత్రం ఓ అద్భుతమైన సాంకేతిక విజయంగా చెప్పొచ్చు. ప్రత్యేకించి డైరెక్టర్లు ఎర్లిచ్, రీడ్, ఎడిటర్ డాన్ ష్వాల్మ్ 3,000 గంటల ఫుటేజీని చిత్రీకరించారు. దాదాపు ఏడు సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. పోస్ట్ ప్రొడక్షన్, వివిధ కెమెరాల నుంచి ఫుటేజీని తీసుకుని అందమైన షాట్‌గా, విజువల్ ట్రీట్‌గా అందించడానికి కృషి చేశారు. అందుకే అత్యద్భుతమైన ఔట్‌పుట్ వచ్చిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతీరోజు దాదాపు 18 గంటలు కష్టపడి 85 నిముషాల డాక్యుమెంటరీని అందించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Next Story

Most Viewed