‘తెలుగు తముళ్లకు భయం.. 2024లో టీడీపీ మటాష్’

151

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ గ్రాఫ్ పడిపోయినందుకు సంతోషపడాలో.. పార్టీలో జరుగుతున్న పరిణామాలకు బాధపడాలో తెలియక టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ పడకపోవడంతో టీడీపీ నేతలు ఆగమాగమవుతున్నారు. సందట్లో సడేమియా అన్న చందంగా తెలుగుదేశం పార్టీపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి విరుచుకుపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ రెచ్చిపోతున్నారు. ఇప్పటికే టీడీపీ చాప్టర్ క్లోజ్ అంటూ పదేపదే విరుచుకుపడిన విజయసాయిరెడ్డి తాజాగా మరోసారి రెచ్చిపోయారు. పార్టీ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్‌ను ఆసరాగా చేసుకుని టీడీపీని ఓ ఆట ఆడుకుంటున్నారు.

టీడీపీలో లోకేశంను ఎవరూ పట్టించుకోవడం లేదు..

అప్పుడు అచ్చెన్న, ఇప్పుడు బుచ్చన్న అంటూ టీడీపీపై వారు చేసిన విమర్శలను గుర్తు చేశారు. బుచ్చయ్య చౌదరి రిజైన్ చేస్తారో లేదో గాని ఆయన చెప్పిన నిజాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి అంటూ ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కుని పొరపాటు చేశారని తాను చంద్రబాబుతో అన్నట్లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి బయటపెట్టడం ఆసక్తికర విషయమన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుని పొరపాటు చేశారన్నందుకు తనను రెండేళ్లపాటు దూరం పెట్టారని ఓ న్యూస్ చానల్ డిబేట్‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల వీడియోను ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పోస్ట్ చేశారు. ఇదే సమయంలో ప్రజలు బాబును ఐదేళ్లు తరిమారు సూపర్ తీర్పు కదా అంటూ విజయ సాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

అనంతరం లోకేశ్‌ను సైతం వదల్లేదు. టీడీపీలో లోకేశాన్ని ఎవరూ గుర్తించడం లేదంటూ విమర్శించారు. ప్రజల మధ్యకి వెళ్లడం, పార్టీని బలోపేతం చేయడం అంటే శవయాత్రలు కాదు మాలోకం అంటూ సెటైర్లు వేశారు. ఏ సమస్య లేని దగ్గర నలుగురిని వెంటేసుకుని అలజడి చేసి రాగానే పరిస్థితి మారదు అంటూ లోకేశ్‌ను టార్గెట్ చేశారు. ఇదే సమయంలో నువ్వు కాలు పెట్టిన చోట సొంత పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. నాయకుడిగా నిన్ను ఎవరూ గుర్తించడం లేదు, తెలుస్తోందా.. అంటూ లోకేశ్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు, అంతకుముందు మరోమారు టీడీపీ పరిస్థితి అధ్వానంగా ఉందంటూ తండ్రి కొడుకుల దెబ్బకు టీడీపీ మటాష్ అంటూ ట్వీట్ చేశారు.

2024 నాటికి పార్టీ లేదు బొక్క లేదు

పార్టీ లేదు బొక్క లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబితే వినలేదని.. ఇప్పుడు ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా అదే చెబుతున్నారని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తండ్రీ కొడుకుల దెబ్బకు టీడీపీ మటాష్ అంటూ.. 2024 నాటికి పార్టీ లేదు బొక్క లేదు అంటూ షాకింగ్ ట్వీట్ చేశారు. టీడీపీలో నెలకొన్న అసమ్మతి నేపథ్యంలో టీడీపీ కనుమరుగవుతోందని తెలుగు తమ్ముళ్లలో భయం పట్టుకుందంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అచ్చోసిన ఆంబోతులా కొడుకును గాలికి వదిలేసిన చంద్రబాబు కుతంత్రాలు పూర్తిగా నేర్పినట్టు లేదు. ఉన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య.. కుటుంబ సభ్యులు ఏమన్నారో విన్నావా లోకేశం. మీ అబ్బ స్థాయిలో డ్రామా రక్తి కట్టించాలంటే ఇంకా టైం పడుతుంది. ఎల్లో మీడియా ఎలివేషన్లు సరిపోవడం లేదు అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. పార్టీలో నెలకొన్న అసమ్మతిని ఎలా చక్కదిద్దాలో అన్నదానిపై చంద్రబాబు, లోకేశ్‌లు తలలు పట్టుకుంటుంటే.. సందట్లో సడేమియా అన్న చందంగా విజయసాయిరెడ్డి చేస్తున్న విమర్శలు టీడీపీకి మరింత ఇబ్బందికరంగా మారాయి.