ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే చిన్నారులు బలి.. కోమటిరెడ్డి సీరియస్

by  |
MP Komatireddy Venkat Reddy
X

దిశ, భువనగిరి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయి, కన్నవాళ్లకి కడుపుకోత మిగిలిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భువనగిరి పట్టణానికి చెందిన ఇద్దరు చిన్నారులు బస్వాపూర్ రిజర్వాయర్‌లో పడి ప్రమాదవశాత్తు మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆ చిన్నారుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ అలసత్వం వల్లే ఇద్దరు బాలురు మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ చుట్టూత ముళ్ల కంచె ఏర్పాటు చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్‌లు నిర్లక్ష్యం చేయడం వల్లే రెండ్రోజుల క్రితం బస్వాపూర్ రిజర్వాయర్‌లోకి ఈతకు వెళ్లిన చిన్నారులు మృతిచెందారని అన్నారు.

ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని స్పష్టం చేశారు. ఇక మీదట ఇలాంటి ఘటనలు బస్వాపూర్ రిజర్వాయర్‌లో జరగకుండా కలెక్టర్ గట్టి భద్రత చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం తరపున ఇరు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, పీసీసీ మాజీ కార్యదర్శి తంగేళ్లపల్లి రవికుమార్ తదితరులు ఉన్నారు.



Next Story