పక్కా ప్రణాళికతోనే.. భైంసా అల్లర్లకు ఆ ఇద్దరే కారణం : ఎంపీ అర్వింద్

by  |
పక్కా ప్రణాళికతోనే.. భైంసా అల్లర్లకు ఆ ఇద్దరే కారణం : ఎంపీ అర్వింద్
X

దిశ, తెలంగాణ బ్యూరో : భైంసా ఘటనలు పక్కా ప్రణాళికలతోనే జరుగుతున్నాయని, ఓ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రెచ్చగొడుతున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. భైంసా భారతదేశంలో భూభాగం కాదనట్లు అక్కడి ఎంఐఎం నేతలు వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదని, ఇది బంగారు తెలంగాణానా..? లేక మజ్లీస్ రాజ్యమో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం బంజారా హిల్స్‌లోని తన ఇంటి వద్ద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ హిందువుల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని విమర్శించారు. గతంలో అల్లర్లు చేసిన వారిని శిక్షించకపోవటంతోనే భైంసాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు. కేటీఆర్‌ ట్వీట్లు చేయడం ఆపి భైంసా ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ చేతకానీ మినిస్టర్‌ అని, గాయపడిన వారిలో ఆయన ఓ వర్గానికే కొమ్ముకాస్తూ చికిత్స అందిస్తున్నారని మండిపడ్డారు. మహమూద్ అలీ చేసిన ట్వీట్‌ చదివితే ఆయన వ్యవహార శైలి అర్థమవుతుందన్నారు.

భూ కబ్జాలు చేయటంలో ఎమ్మెల్సీ కవిత, సోదరుడు కేటీఆర్‌ను మించిపోయారని, అన్నా‌‌చెల్లెళ్లు తెలంగాణ సమాజానికి ప్రమాదకరంగా మారారన్నారు. అల్లర్లకు ఓ పార్టీకి చెందిన స్థానిక నాయకుడే కారణమని ఆరోపించారు. అక్కడ ఉన్న కొనేరును మూసివేసి బయట నుంచి వచ్చిన ఓ సామాజికి వర్గానికి చెందిన వారికి ఇళ్లు కట్టుకునేందుకు అనుమతులిస్తున్నారన్నారు. అంగడి స్థలాన్ని కూడా బయట వారు ఇళ్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని ఆరోపించారు. 5 సంవత్సరాల నుంచి ఈ తంతు జరుగుతుందని, దాదాపు 20 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేశారన్నారు. శ్మశానవాటికనూ కబ్జా చేస్తున్నారని, దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉందని, ఇదే విషయాలను ప్రశ్నిస్తే గొడవలు చేస్తున్నారన్నారు. ఇవేవి పట్టించుకోకుండా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతున్నారని, ఆయన ముందు బాలీవుడ్‌ మత్తు నుంచి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందన్నారు. అల్లర్లలో గాయపడిన వారి విషయంలో ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు. గాయపడిన వారికి కనీసం వైద్య చికిత్స అందించలేదని, వారిని బీజేపీ నేతలే హైదరాబాద్‌కు తరలించారన్నారు. నిజామాబాద్‌ దవాఖానలో కనీస సౌకర్యాలు లేవని, ఇది ప్రభుత్వ పాలనకు అద్దం పడుతోందని దుయ్యబట్టారు.

అల్లరి మూకలకు కలెక్టర్ మద్దతు..

భైంసా అల్లర్లను అదుపు చేయడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారని, అల్లరి మూకలకు అక్కడి కలెక్టర్ మద్దతుందని అరవింద్ ఆరోపించారు. నాయకులపై నిఘా పెట్టే ఇంటెలిజెన్స్ భైంసాలో ఎందుకు అలర్ట్​ కాలేదని ప్రశ్నించారు. శాంతిభద్రతల పరిరక్షణలో కేసీఆర్ సర్కార్ అట్టర్ ఫ్లాప్​ అయిందని, వారికి చేతకాదని చెబితే కేంద్రం లా అండ్ ఆర్డర్ మెయింటేన్​ చేస్తుందన్నారు. భైంసా ఘటనపై కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని, అల్లర్ల అంశాన్ని కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ అర్వింద్​ తెలియజేశారు.



Next Story

Most Viewed