దుబ్బాకలో ‘బండి’ గెలుపు బాట వేసేనా..!

by  |
దుబ్బాకలో ‘బండి’ గెలుపు బాట వేసేనా..!
X

దిశ ప్రతినిధి, మెదక్: టీఆర్ఎస్ కంచుకోట అయిన దుబ్బాకలో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం ఉంటుందనేది కమలనాథుల ఆలోచన. 2023 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దుబ్బాక ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు ఎంపీలు బీజేపీ నుండి గెలిచినప్పటికీ, ఏదో గాలివాటంగా గెలిచారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. దీంతో బీజేపీకి దుబ్బాక గెలుపు అనివార్యంగా మారింది. అయితే బండి సంజయ్ పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయనకు ఎదురవుతున్న తొలి సవాల్ ఇది. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని నిరూపించాలన్నా, పార్టీ నాయకత్వ మార్పు మార్క్ కనిపించాలన్నా ఈ ఎన్నికలు సంజయ్‌కు చాలా ముఖ్యం. అందుకు గులాబీ కోటలో కమలాన్ని వికసింపజేసేందుకు ఆ పార్టీ శ్రేణులు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి. మరి ఉప ఎన్నికలో దుబ్బాకను లాగేసుకునేందుకు బండి పక్కా ప్రణాళికలు ఎంతమేరకు పని చేస్తాయోననే ఆసక్తి స్థానికంగా నెలకొంది.

దుబ్బాకలో గెలుపుపై కమలనాథులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. 2019 లోకసభ ఎన్నికల్లో తమ గెలుపు ఆషామాషీ కాదని, కాంగ్రెస్ రేసులో లేదని, 2023లో టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పేందుకు, నాయకత్వ మార్పు ప్రభావం చూపించడానికి ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత అవశ్యకమని ఆ పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. 2018 చివరలో ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ 80కి పైగా శాసన సభ స్థానాలను గెలుచచుకొని భారీ విజయం దక్కించుకున్నారు. కానీ ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ‘సారు.. కారు.. పదహారు’ అనే నినాదంతో ముందుకెళ్లిన గులాబీ నేతలకు కాషాయ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. 2018లో ఒకేఒక్క అసెంబ్లీ సీటు గెలిచిన బీజేపీ 2019 లోకసభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అంటే 30కి పైగా అసెంబ్లీ స్థానాల్లో కమలం ప్రభావం కనిపించింది. లోకసభ ఎన్నికల నుండి టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంది. ఇప్పుడు అది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మార్చాలని ఆ పార్టీ నేతలు పక్కా వ్యూహంతో పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంజయ్‌కు పరీక్షే..

ప్రస్తుతం మార్పు, దూకుడు స్వభావమున్ననేతలు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నారు. యూత్ ఫాలోయింగ్ ఉన్న బండి సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా అధిష్టానం బాధ్యతలు అప్పగించడంతో ఆయనకు దుబ్బాక ఉప ఎన్నిక పెద్ద సవాల్‌గా మారింది. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు నామినేషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్ మాట్లాడిన మాటలు కొంత యువతలో ఉత్సాహాన్ని కల్గించినా, దాని ప్రభావం పోలింగ్ తేదీ వరకు ఉంటుందా? లేదా? అనేది సందేహంగా ఉంది. 2004 నుండి 2020 వరకు 2009 ఎన్నికల్లో మినహా మిగతా అన్నిసార్లు టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తూ వస్తున్నది. అయితే ఈసారి టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టడం ఖాయమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాకలో స్థానిక సమస్యలే తమను గెలిపిస్తాయని బీజేపీ చెబుతోంది. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు సంబంధించి నియోజకవర్గ రైతులకు తక్కువ పరిహారం ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.

పక్కనే ఉన్న సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గం వారికి ఇచ్చినదాంట్లో సగం కూడా దుబ్బాక ప్రజలకు ఇవ్వలేదనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉందని బీజేపీ చెబుతోంది. అలాగే కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. విపక్షాలు ఏపీని ఉదాహరణగా చూపిస్తూ టీఆర్ఎస్ పాలనపై నిప్పులు చెరుగుతున్నాయి. ఫార్మా హబ్ హైదరాబాద్ ఉన్నప్పటికీ తెలంగాణలో కేసులు అంతకంతకూ పెరగడానికి కారణం కేసీఆర్ పాలనా వైఫల్యమేనని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానిది కీలక వైఫల్యంగా భావిస్తుంటే, అలాగే రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు తమకు కలిసివస్తాయని కమలనాథులు భావిస్తున్నారు.

సానుభూతి పనిచేయదంటున్న బీజేపీ..

అధికారంతో పాటు సానుభూతి టీఆర్ఎస్ వైపు ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ నారాయణఖేడ్ లాంటి ఉప ఎన్నికల్లో సానుభూతి పని చేయలేదని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ అదే అంశం మాట్లాడాలనుకుంటే రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన రఘునందన్‌రావు బీజేపీ తరఫున బరిలో ఉన్నందున ఆయనకు కూడా వర్తిస్తుందని లాజిక్ లాగుతున్నారు. సానుభూతి అంశానికి కాలం చెల్లిందని, ప్రజలు చైతన్యవంతులు అయ్యారని, కరోనా ఫెయిల్యూర్, దుబ్బాక ప్రజలకు ఇన్నాళ్లు పింఛన్లు ఇవ్వకుండా ఇప్పుడు హడావుడిగా ఇవ్వడం, భూపరిహారం లాంటి అంశాలే రఘునందనరావు సునాయసంగా గెలిచేలా చేస్తాయని కమలం నేతలు భావిస్తున్నారు.


Next Story

Most Viewed