రాక్షసులందరికీ ఇదే నా సమాధానం.. ఆ వివాదాస్పద పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ

by Mallepaka Hamsa |

తాను కేవలం రెండు రకాల సినిమా శైలుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే వివరించానని అన్నారు.

రాక్షసులందరికీ ఇదే నా సమాధానం.. ఆ వివాదాస్పద పోస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) మరోసారి సోషల్ మీడియా వేదికగా సినిమా ఇండస్ట్రీలో మంటలు పుట్టించారు. మార్చి 19న బాక్సాఫీస్ వద్ద తలపడనున్న రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ (Toxic)ఆదిత్య ధర్ ‘ధురంధర్-2’ (Dhurandhar-2)చిత్రాలను ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీసింది. ఈ పోరాటాన్ని ‘డేవిడ్ వర్సెస్ గోలియత్’ యుద్ధంతో పోల్చిన వర్మ.. భారీ బడ్జెట్, హీరో ఎలివేషన్ల కంటే కథలోని తెలివితేటలే ముఖ్యమని తనదైన శైలిలో వివరించారు. ‘ధురంధర్ 2’ ప్రేక్షకుల మెదడుకు పని చెబితే, ‘టాక్సిక్’ వంటి మాస్ సినిమాలు ప్రేక్షకులు మూర్ఖులని ఊహిస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

ముఖ్యంగా సినిమా మేకింగ్‌లో ఉండే పది క్రూరమైన సత్యాలను వర్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 700 కోట్లు ఖర్చు చేసి ఒక హీరోను దేవుడిగా చూపించడం, ఫిజిక్స్‌కు విరుద్ధంగా గాలిలో ఎగిరే ఫైట్లు చేయడం, చెవులు చిట్లించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రేక్షకులకు.. ఇక్కడ ఈలలు వేయండి అని సూచించడం వంటి అంశాలను ఆయన తప్పుబట్టారు. కేజీఎఫ్-2 వంటి సినిమాలు మాస్‌లోని డంబ్‌నెస్ ను లక్ష్యంగా చేసుకున్నాయని, కానీ 130 కోట్లతో తీసిన ‘ధురంధర్’ కేవలం కథా బలంతో 1500 కోట్లు వసూలు చేసి ప్రేక్షకులు మేధావులని నిరూపించిందని వర్మ ఘాటుగా రాసుకొచ్చారు. వర్మ చేసిన ఈ విమర్శలు ముఖ్యంగా కన్నడ సినీ అభిమానులకు ఆగ్రహం కలిగించడంతో, సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.

రామ్ గోపాల్ వర్మ ధురంధర్-2కు సపోర్ట్ చేస్తూ.. టాక్సిక్‌ను తక్కువ చేశారని యష్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా.. వర్మను ట్రోల్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఆర్జీవీ వెంటనే క్లారిటీ ఇస్తూ మరో పోస్ట్ పెట్టారు. రాక్షసులందరికీ నా సమాధానం ఇదే అంటూ.. తాను కేవలం రెండు రకాల సినిమా శైలుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే వివరించానని, ఏ ఒక్క చిత్రాన్ని వ్యక్తిగతంగా కించపరచడం తన ఉద్దేశం కాదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా మార్చి 19న థియేటర్లలో లైట్లు ఆరిపోయినప్పుడు భారతీయ సినిమా ధురంధర-2 లేక టాక్సిక్ అనేది తేలిపోతుందని ఆయన సవాల్ విసిరారు. దీంతో వివాదానికి చెక్ పడినట్లు అయింది.

Next Story