సినిమాల్లో ట్రెండ్ సెట్ చేస్తోన్న తెలంగాణ డైలాగ్స్

by Disha Web Desk 2 |
సినిమాల్లో ట్రెండ్ సెట్ చేస్తోన్న తెలంగాణ డైలాగ్స్
X

తెలుగు భాష ఒక్కటే అయినా.. అందులో యాసలెన్నో. ఈ మాండలికాలు ఏ కవులో.. రచయితల కలాలనుంచో ఊడిపడలేదు. సామాన్య ప్రజలు మాట్లాడుకునే పదాల అల్లికే మాండలికం. ఆ యాసలో జీవం ఉంటుంది. అందుకే కోపం కట్టలు తెంచుకున్నా.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయినా మన యాసలోకి వచ్చేస్తాం. తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస ఒకప్పుడు విలన్లు, జోకర్లకు మాత్రమే అన్నట్టు ఉండేది. కానీ, అది హిట్​ ఫార్మూలా. తెలంగాణ యాస, పల్లె జీవనం ఆధారంగా సినిమాలు వస్తున్నాయి. స్టార్​ హీరోలు, హీరోయిన్లు, ప్రధాన నటీనటులు తెలంగాణ యాసకు ప్రాణం పోస్తున్నరు.. సినిమాల్లో తెలంగాణ యాసకు పెరుగుతున్న ప్రాధాన్యతపై ఈ వారం స్పెషల్​ స్టోరీ.. ‌‌ = సుజిత రాచపల్లి

‘తెలంగాణ యాసతో మేమ్ ఫేమస్’ సినిమా సూపర్​హిట్‌గా నిలిచింది. ‘దసరా’ సినిమా తెలంగాణ కథతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలంగాణ పల్లె జీవనాన్ని, కుటుంబ బంధాల గొప్పతనాన్ని ‘బలగం’ సినిమా దేశవ్యాప్తంగా చాటిచెప్పింది. ఓటీటీలో డబ్ అయిన ఇతర ఇండస్ట్రీల చిత్రాలు, సిరీస్‌లన్నీ తెలంగాణ యాసకు ‘ఫిదా’ అయిపోయాయి. తెలుగు ప్రజల ‘ఇంటింటి రామయణం’గా మారాలనుకుంటున్నాయి. దీంతో ఒకప్పుడు కోనసీమ కోడిపందేలు కావాలనుకున్న ప్రేక్షకులే గదేముందిలే ‘ధూమ్ ధామ్ చేద్దాం’ అంటున్నారు. ‘డీజే టిల్లు’గాడి లాంటి సినిమాలే కోరుకుంటున్నారు. గతంలో తెలంగాణ గురించి ఏం చెప్తాంలే అనుకున్న దర్శకులే.. ఇప్పుడు తెలంగాణ సెంట్రిక్ మూవీస్ చేస్తున్నారు. దీంతో మార్పు అంటే ఇది.. మ్యానరిజమ్ అంటే మాది.. అని మురిసిపోతున్నారు ఈ ప్రాంత యూత్. మొత్తానికి ‘ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి’ అన్న సామెత.. ఈ పరిస్థితికి చక్కగా సరిపోతుండగా.. సినిమా ఇండస్ట్రీపై తెలంగాణ యాస ప్రభావం.. అది వినియోగించి హిట్ ట్రాక్‌లోకి వచ్చిన తెలుగు పరిశ్రమ.. దీన్ని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకుని బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న తెలంగాణ పోరగాండ్ల కథేందో తెలుసుకుందాం.

హీరోయిజమ్.. ఎలివేషన్స్..

తెలుగు సినిమా అంటే కోనసీమ అందాలు.. కోస్తాంధ్ర వాతావరణం మాత్రమే ఉండేది. హీరోలు, హీరోయిన్లు కూడా అక్కడి నుంచే ఎక్కువ మంది వచ్చేవారు. తెలంగాణ ప్రాంతం నుంచి సినిమాకు ప్రాతినిథ్యం వహించిన వారిని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. హీరోయిజానికి తెలుగును వాడిన దర్శకులు.. విలన్‌ను మాత్రం తెలంగాణ యాసను జోడించి వెకిలిగా తెరకెక్కించేవారు. కామెడీ యాడ్ చేసి జోకర్స్‌గా మార్చేవారు. కడుపు మండినా వాళ్లు ఏం చేస్తారు? కన్నెర్రజేసినా మనకు పోయేదేముంది? అన్నట్లుగా ఈ ప్రాంత ప్రజలను లైట్ తీసుకునేవారు. కానీ అదే యాస ఇప్పుడు హీరోల ఎలివేషన్ డైలాగ్ అయిపోయింది. అదే ప్రాంతం కథానాయకుడి వీరత్వాన్ని ప్రదర్శించే నేలగా మారింది. అయితే ఈ మార్పు ఎందుకొచ్చింది? తెలంగాణ రావడమే ఇందుకు కారణమా? లేక కోనసీమ, కోస్తా, కొబ్బరిచెట్లతో విసిగిపోయిన ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారా? అంటే రెండూ కరెక్టే. తెలంగాణ సిద్ధించాక మార్పు అనివార్యమైంది. అది ఈ ప్రాంత ప్రజలతో పాటు ఏపీ జనాలకు కూడా నచ్చింది.

తెరమీదే కాదు తెర వెనుక

మార్పు కేవలం తెరమీదే కాదు తెరవెనుక కూడా జరిగింది. ఒకప్పుడు తెలంగాణ యాస మాట్లాడితే పాత్ర దక్కదేమో అనే భయంతో ఆ స్లాంగ్ మాట్లాడేందుకు జంకుతుండే వారు నటులు. కానీ ఇప్పుడు ఈ స్లాంగ్‌తోనే అభిమానులను సంపాదించుకుంటున్నారు. హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. విజయ్ దేవరకొండ, డీజే టిల్లు ఫేమ్ జొన్నలగడ్డ సిద్ధు, విజయ్ దేవరకొండ, ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య, ‘మేమ్ ఫేమస్’ హీరో సుమంత్ ప్రభాస్ లాంటి యంగ్ యాక్టర్స్‌కు ఇదే సక్సెస్ మంత్రగా మారింది. అంతెందుకు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ తెలంగాణ జానపదాన్ని జోడించి.. మెగాస్టార్ లాంటి హీరోలే తెలంగాణ యాసకు దాసోహం అంటున్నారు. ఈ మధ్య ‘భోళా శంకర్’ మూవీలో ‘నర్సపెల్లే’ సాంగ్‌ వాడటం ఇందుకు ఉదాహరణ. కాగా రవితేజ కూడా ప్రతి సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్‌ను యూజ్ చేస్తూ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక తెలంగాణ నుంచి వచ్చిన దర్శకులు, నటుల సంఖ్య పెరుగుతుండగా.. బ్లాక్ బస్టర్ హిట్స్‌తో దుమ్మదులిపేస్తున్నారు.

యూట్యూబ్‌, ఓటీటీలో పెద్దపీట

‘బలగం’, ‘డీజే టిల్లు’, ‘ఇంటింటి రామాయణం’, ‘మేమ్ ఫేమస్’, ‘ఫిదా’, ‘కింగ్’, ‘రుద్రంగి’, ‘ఓదెల రైల్వే స్టేషన్’ లాంటి సినిమాలు తెలంగాణ యాసలో రావడమే కాదు వరంగల్ లాంటి ప్రాంతంలో షూటింగ్ చేసుకుని.. ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్నాయి. ఇదిలా ఉంటే యూట్యూబ్‌లోనూ తెలంగాణకు పెద్దపీట వేశారు ప్రేక్షకులు. ‘మై విలేజ్ షో’ ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కాగా 50ఏళ్లుపైబడిన గంగవ్వను సెలబ్రిటీగా మార్చింది తెలంగాణ యాసనే. నేషనల్ వైడ్ గుర్తింపు పొందిన గంగవ్వ.. పవర్ ఫుల్ ఉమన్‌గా మన్ననలు అందుకుంది. ఇక ఈ కోవలోకే క్రియేటిక్ థింక్స్, విలేజ్ ఐమ్యాక్స్ లాంటి చానల్స్ చెందుతుండగా.. ఈ తెలంగాణ యాసతోనే జ్యోతక్క లాంటి న్యూస్ రీడర్లు కూడా పాపులారిటీ దక్కించుకున్నారు.

Read More:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు వైసీపీ ఎంపీ స్పెషల్ విషెస్

Next Story

Most Viewed